PAK vs NZ: చివరి 5 ఓవర్లలో 84 పరుగులు.. మెరుపు సెంచరీతో పాక్ బౌలర్లను చితక్కొట్టిన ఫిలిప్స్

PAK vs NZ: చివరి 5 ఓవర్లలో 84 పరుగులు.. మెరుపు సెంచరీతో పాక్ బౌలర్లను చితక్కొట్టిన ఫిలిప్స్

ట్రై సిరీస్ లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు అద్భుతమైన ఆట తీరుతో అదరగొట్టింది. లాహోర్ వేదికగా గడాఫీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ చేసి ఆతిధ్య జట్టుకు ఛాలెంజ్ విసిరింది. టాస్ గెలిచి మొదట చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోర్ చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ పాక్ బౌలర్లను చితక్కొడుతూ మెరుపు సెంచరీ (74 బంతుల్లో 106: 6 ఫోర్లు, 7 సిక్సర్లు) చేశాడు. మిచెల్(81), విలియంసన్ (58) హాఫ్ సెంచరీలు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడారు. 

ఆదుకున్న మిచెల్, కేన్ మామ:

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ కు మంచి ఆరంభం లభించలేదు. తొలి ఓవర్లోనే విల్ యంగ్ ను షహీన్ ఆఫ్రిది ఔట్ చేశాడు. నాలుగు బౌండరీలు కొట్టి ఊపు మీదున్న రచీన్ రవీద్ర అబ్రార్ అహ్మద్ బౌలింగ్ లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటౌయ్యాడు. ఈ దశలో విలియంసన్ (58), మిచెల్(81) జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్ కు 95 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు.

చివర్లో ఫిలిప్స్ ధనాధన్:

200 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ 270 వెళ్తుందని భావించారు. అయితే ఫిలిప్స్ మెరుపులతో స్కోర్ బోర్డు ఒక్కసారిగా దూసుకెళ్లింది. 246 పరుగులు చేసిన కివీస్ చివరి 5 ఓవర్లలో ఫిలిప్స్ విజ్రంభించడంతో 84 పరుగులు చేసింది. 45 ఓవర్ల తర్వాత 43 పరుగుల వద్ద ఉన్న ఫిలిప్స్.. పాక్ బౌలర్లపై శివతాండవం చేసి ఏకంగా సెంచరీని చేయడం విశేషం. చివరి మూడు ఓవర్లలో 59 పరుగులు రాబట్టింది. వీటిలో ఫిలిప్స్ 5 సిక్సర్లు, రెండు ఫోర్లు కొట్టాడు. పాకిస్థాన్ బౌలర్లలో అఫ్రిది మూడు వికెట్లు  తీసుకోగా.. అబ్రార్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.