పాకిస్థాన్​ 14వ అధ్యక్షుడిగా అసీఫ్ అలీ జర్దారీ

పాకిస్థాన్ 14వ అధ్యక్షుడిగా (Pakistan President) పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) సీనియర్ నేత అసిఫ్ అలీ జర్దారీ (Asif Ali Zardari) శనివారం ( మార్చి9)న  ఎన్నికయ్యారు. పాక్ అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక కావడం ఇది రెండోసారి. పీపీపీ, పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ (PML-N) సంకీర్ణ ప్రభుత్వం ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో నిలబడిన జర్దారీకి 255 ఓట్లు పోలయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతున్న సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ (SIC) అభ్యర్థి మహమ్మద్ ఖాన్ అచక్‌జయీకి 119 ఓట్లు వచ్చాయి.

దివంగత్ పాక్ ప్రధాని బెనజీర్ భుట్టో భర్త అయిన 68 ఏళ్ల జర్దారీ 2008 నుంచి 2013 వరకూ పాక్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. మరోసారి పాక్ అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక కావడంతో డాక్టర్ అరిఫ్ అల్వి స్థానంలో ఆయన పగ్గాలు చేపట్టనున్నారు. అరిఫ్ అల్వి ఐదేళ్ల పదవీకాలం గత ఏడాదిలో ముగిసినప్పటికీ కొత్త ఎలక్ట్రోరల్ కాలేజీ ఏర్పాటు కాకపోవడంతో ఆయన పదవిలో కొనసాగుతూ వచ్చారు.

ALSO READ :-స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు టాటా టెక్నాలజీస్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం.. జాతీయ అసెంబ్లీ మరియు నాలుగు ప్రావిన్షియల్ అసెంబ్లీలకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ఎలక్టోరల్ ద్వారా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. 2008 నుంచి 2013 వరకు అధ్యక్షుడిగా పనిచేసిన జర్దారీ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి పౌరుడు కూడా ఆయనే. ఆదివారం ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.