వన్డే వరల్డ్ కప్‌లో వరుసగా నాలుగో ఓటమి ఖాతాలో వేసుకున్న పాకిస్తాన్ సెమీ ఫైనల్ రేసు నుంచి దాదాపు వైదొలిగింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఒక్క వికెట్ తేడాతో పాక్‌ను ఓడించి టోర్నీలో ఐదో విజయంతో టాప్ ప్లేస్‌కు వెళ్లింది.
చెన్నై: వన్డే వరల్డ్ కప్‌లో మరో థ్రిల్లింగ్ ఫైట్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి అంచుల్లోకి వెళ్లొచ్చిన సౌతాఫ్రికా ఒక్క వికెట్ తేడాతో పాకిస్తాన్‌పై గెలిచింది. ఐదో విక్టరీతో పాయింట్స్ టేబుల్‌లో తొలిసారి టాప్ ప్లేస్‌కు వచ్చింది. ఆరు మ్యాచ్‌ల్లో వరుసగా నాలుగో ఓటమితో సెమీస్ రేసు నుంచి దాదాపు వైదొలిగింది. మిగిలిన మూడింటిలో గెలిచినా పాక్ సెమీస్ చేరే అవకాశం ఐదు శాతమే ఉంది. చెపాక్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 270 రన్స్‌కు ఆలౌటైంది. సౌద్ షకీల్ (52 బాల్స్‌లో 7 ఫోర్లతో 52), కెప్టెన్ బాబర్ ఆజమ్ (65 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 50) ఫిఫ్టీలతో రాణించారు. సఫారీ బౌలర్లలో తబ్రియాజ్ షంసి నాలుగు, మార్కో జాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌లో సౌతాఫ్రికా 47.2 ఓవర్లలో 271/9 స్కోరు చేసి గెలిచింది. ఐడెన్ మార్‌క్రమ్ (93 బాల్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 91) అదరగొట్టాడు. వరల్డ్ కప్‌లో 1999 తర్వాత పాక్‌పై సఫారీలకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. షంసికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
పడుతూ లేస్తూ
టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. టాపార్డర్‌లో బాబర్, మిడిలార్డర్‌లో సౌద్ షకీల్‌కు తోడు షాదాబ్ ఖాన్ (36 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 43) మెరుపులతో పాక్ ఆమాత్రం స్కోరు చేయగలిగింది. స్టార్టింగ్‌లో మార్కో జాన్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన వరుస ఓవర్లలో ఓపెనర్లు షఫీక్ (9), ఇమామ్ (12)ను పెవిలియన్ చేర్చి పాక్‌ను దెబ్బకొట్టాడు. ఈ దశలో బాబర్.. రిజ్వాన్ (31)తో మూడో వికెట్‌కు 48 రన్స్, ఇఫ్తికార్ అహ్మద్ (21)తో నాలుగో వికెట్‌కు 43 రన్స్ జోడించాడు. ఈ క్రమంలో ఫిఫ్టీ కూడా పూర్తి చేసుకున్నాడు. కానీ, వరుస ఓవర్లలో ఇఫ్తికార్, బాబర్‌నుపెవిలియన్ చేర్చిన స్పిన్నర్ షంసి పాక్‌ను 141/5తో కష్టాల్లోకి నెట్టాడు. ఈ టైమ్‌లో కౌంటర్ ఎటాక్ చేసిన షకీల్, షాదాబ్ ఆరో వికెట్‌కు 84 రన్స్ జోడించారు. దాంతో పాక్ 300 రన్స్ చేసేలా కనిపించింది. కానీ, షాదాబ్‌ను ఔట్ చేసిన కొయెట్జీ ఈ జోడీని విడదీసి బ్రేక్ ఇచ్చాడు. నవాజ్ (24) తప్ప చివరి బ్యాటర్లంతా నిరాశ పరచడంతో పాక్ నార్మల్ స్కోరుకే పరిమితమైంది.
మార్‌క్రమ్ జోరు
ఛేజింగ్‌లో సౌతాఫ్రికాకు మెరుపు ఆరంభం లభించింది. షాహీన్ వేసిన రెండో ఓవర్లో ఓపెనర్ డికాక్ (24) నాలుగు ఫోర్లతో అలరించాడు. తన తర్వాతి ఓవర్లోనే అతడిని ఔట్ చేసిన షాహీన్ ప్రతీకారం తీర్చుకోగా.. వన్‌డౌన్‌లో వచ్చిన డసెన్ (21)తో కలిసి కెప్టెన్ బవూమ (24) రెండో వికెట్‌కు 33 రన్స్ జోడించి వసీంకు వికెట్‌కు ఇచ్చుకున్నాడు. ఈ దశలో ఫామ్‌లో ఉన్న మార్‌క్రమ్ బాధ్యతగా బ్యాటింగ్ చేశాడు. డసెన్‌తో మూడో వికెట్‌కు 54 రన్స్ జోడించాడు. కానీ, వరుస విరామాల్లో డసెన్, హిట్టర్ క్లాసెన్ (12) పెవిలియన్ చేర్చిన పాక్ బౌలర్లు సఫారీలపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. మరో ఎండ్‌లో క్రీజులో పాతుకుపోయిన మార్‌క్రమ్ మాత్రం పట్టుదలగా ఆడాడు. డేవిడ్ మిల్లర్ (29), జాన్సెన్ (20)తో కీలక భాగస్వామ్యాలతో ముందుకెళ్లాడు. ఈ క్రమంలో సఫారీ స్కోరు 250 దాటింది. మార్‌క్రమ్ జోరు చూస్తుంటే అతను సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు సఫారీ టీమ్ ఈజీగా టార్గెట్‌ను అందుకునేలా కనిపించింది. కానీ, చివర్లో పాక్ బౌలర్లు అనూహ్యంగా విజృంభించారు. మార్‌క్రమ్‌ను ఉసామా మిర్, కొయెట్జీ (10)ని షాహీన్ ఔట్ చేయడంతో సఫారీ టీమ్ 250/8తో ఎదురీత మొదలు పెట్టింది. విజయానికి మరో 21 రన్స్ అవసరమైన దశలో కేశవ్ మహారాజ్ (21 బాల్స్‌లో 7 నాటౌట్) ఓపిగ్గా బ్యాటింగ్ చేశాడు. 46వ ఓవర్లో హారిస్ రవూఫ్ కండ్లు చెదిరే రిటర్న్ క్యాచ్‌తో ఎంగిడి (4)ని ఔట్ చేసి పాక్ టీమ్‌లో ఆశలు రేపాడు. కానీ, షంసి (4 నాటౌట్) సపోర్ట్‌తో ముందుకెళ్లిన మహారాజ్.. నవాజ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి మ్యాచ్ ముగించాడు. షాహీన్ షా మూడు, రవూఫ్, వసీం, ఉసామా తలో రెండు వికెట్లు తీశారు.
సంక్షిప్త స్కోర్లు
- పాకిస్తాన్: 46.4 ఓవర్లలో 270 ఆలౌట్
- (షకీల్ 52, బాబర్ 50, షంసి4/60)
- సౌతాఫ్రికా: 47.2 ఓవర్లలో 271/9
- (మార్‌క్రమ్ 91, షాహీన్ 3/45)