PCB: పాక్ క్రికెటర్లకు కొత్త నిబంధనలు.. నిద్రపోతే లక్షన్నర జరిమానా

PCB: పాక్ క్రికెటర్లకు కొత్త నిబంధనలు.. నిద్రపోతే లక్షన్నర జరిమానా

ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్తాన్ క్రికెటర్లకు ఏదీ కలిసిరావడం లేదు. ఇప్పటికే తొలి టెస్టులో ఓటమిపాలైన పాక్.. రెండో టెస్టులోనూ అదే బాటలో పయనిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ విఫలమవుతున్న పాక్ ఆటగాళ్లు.. ఫీల్డింగ్‌లోనూ మెప్పించట్లేదు. కీలక క్యాచ్‌లు జారవిడుస్తున్నారు. పైగా ఈ లీలలు చాలవన్నట్లు తుది జట్టులో భాగం కానీ కొందరు ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి కునుకుతీస్తున్నారు. ఈ విషయంపై ఫిర్యాదులు రావడంతో పాక్ టీమ్ మేనేజ్‌మెంట్ అప్రమత్తమైంది.

నిద్రపోతే లక్షన్నర జరిమానా

ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మేనేజ్‌మెంట్ ఆటగాళ్ల కోసం కఠినమైన నిబంధనలు ప్రవేశపెట్టింది. జాతీయ జట్టు డైరెక్టర్ మహ్మద్ హఫీజ్ నేతృత్వంలో జీరో-టాలరెన్స్ పాలసీతో కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP)ని ప్రవేశపెట్టింది. తుది జట్టులో భాగం కానీ ఆటగాడు కావొచ్చు లేదా మరే ఇతర క్రికెటర్ కావొచ్చు డ్రెస్సింగ్ రూమ్‌లో పడుకుంటే 500 డాలర్ల జరిమానా(పాకిస్తాన్ కరెన్సీలో లక్షన్నర) విధించనున్నారు. అలాగే, క్యాచ్‌లు జారవిడిచి ఆటగాళ్లకు ప్రత్యేక ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించనున్నారు. ఈ నిబంధనలు ఇప్పటికే పాక్ క్రికెటర్లకు తెలియజేసినట్లు సమాచారం.

ఎందుకు ఈ రూల్స్ తీసుకొచ్చారు..?

నివేదికల ప్రకారం.. ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం కాని కొంతమంది ఆటగాళ్లు, మునుపటి మేనేజ్‌మెంట్ ఉన్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో పడుకునేవారు. అదే కొత్త టీమ్ మేనేజ్‌మెంట్ వచ్చాక ఆటగాళ్లు స్టేడియంలో కాకుండా హోటల్‌లో ఉన్నప్పుడు మాత్రమే నిద్రపోవాలని సూచించింది. అయితే వీటిని ఎవరూ పాటించట్లేదు. ఒకవైపు మ్యాచ్ జరుగుతుంటే.. మరోవైపు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి హాయిగా నిద్రపోతున్నారు. ఈ క్రమంలోనే కొత్త రూల్స్ తీసుకొచ్చింది.

క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తూ పాక్ క్రికెట్ బోర్డు తీసుకొచ్చిన కొత్త రూల్స్ క్రికెట్ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. వీటిని కొందరు సమర్దిస్తుంటే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.