ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొత్త ప్రతిపాదనను భారత్ ముందుకు తెచ్చారు. ఇండియా పీఎం నరేంద్ర మోడీతో టీవీ ఇంటర్వ్యూలో పాల్గొనాలని ఉందంటూ ఆయన ప్రతిపాదించారు. భారత్–పాకిస్తాన్ మధ్య నెలకొన్న వివాదాలకు స్వస్తి చెప్పడానికి ఇదే సరైన సమయం అన్నారు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనాలని ఉందన్నారు. పాక్‌పై భారత్‌కు ఎలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ.. ఇరు దేశాల మధ్య సానుకూల వాతావరణం కోసం తాము ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. రష్యా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఇమ్రాన్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు.
Prime Minister @ImranKhanPTI invites PM @narendramodi for a debate to resolve the differencs between two countries. pic.twitter.com/6PRcoFBG4l
— Muhammad Faizan Yasin (@faizanMFY) February 22, 2022
వ్యాపార లావాదేవీలు పెరగాలె
‘మోడీతో టీవీ డిబేట్ లో పాల్గొనాలని ఉంది. భారత ఉపఖండంలో ఉన్న కోట్లాది మందికి ఈ డిబేట్ ఉపయోగకరంగా ఉంటుంది. భారత్ శత్రు దేశంగా మారింది. అందుకే వారితో వ్యాపారం చేయలేకపోతున్నాం. ఇరు దేశాల మధ్య సాన్నిహిత్యం పెరిగితే వ్యాపార లావాదేవీలు పెరుగుతాయి. ఇది ఇరు దేశాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని ఆ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ చెప్పారు. అయితే, ఇమ్రాన్ ప్రతిపాదనకు భారత విదేశాంగ శాఖ ఇప్పటి వరకు స్పందించలేదు.
కాగా, గతంలోనే భారత విదేశాంగ శాఖ ఓ కీలక ప్రకటన చేసింది. ఉగ్రవాదం–చర్చలు ఒకేసారి కుదరదని తేల్చి చెప్పింది. భారత్‌తో చర్చించాలనుకుంటే ఉగ్రవాదాన్ని వదిలేయాలని సూచించింది. ఉగ్రవాద రహిత వాతావరణంలో మాత్రమే చర్చలు జరుగుతాయని భారత్ పదే పదే చెబుతోంది. చర్చలు జరిగే ముందు ఉగ్రవాదంపై అణచివేతకు సంబంధించిన ఆధారాలు చూపించాలని ఇస్లామాబాద్‌కు న్యూఢిల్లీ స్పష్టం చేసింది. అలాగే కశ్మీర్‌లో టెర్రరిస్టులకు అడ్డుకట్ట వేసేవరకు చర్చలు లేవని భారత ప్రభుత్వం తెగేసి చెప్పింది.
మరిన్ని వార్తల కోసం: