- అల్లర్లలో పోలీస్ మృతి.. పలువురు అరెస్ట్
ఇస్లామాబాద్: పలు కేసులకు సంబంధించి ప్రస్తుతం జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆ దేశంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్‌ఖాన్‌ను కలుసుకునేందుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు భారీ కాన్వాయ్‌తో ఇస్లామాబాద్‌కు ర్యాలీగా వస్తున్నారు. అయితే, వారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు.
ఇమ్రాన్ మద్దతుదారులను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇస్లామాబాద్ లో జరిగిన ఘర్షణలో ఒక పోలీస్ మృతి చెందాడు. దీంతో పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. పీటీఐ చైర్మన్ గోహర్ అలీ ఖాన్‌తో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు జైలులో ఇమ్రాన్ ను కలుసుకున్నారు.
ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు. ఆందోళనలు నిలిపివేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఆందోళనకారులు ఇస్లామాబాద్‌కు రాకుండా పోలీసులు అన్ని రోడ్లను మూసివేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరసనల నేపథ్యంలో పంజాబ్ ప్రావిన్స్ కు దేశంలోని మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. నిత్యవసరాల రవాణా నిలిచిపోవడంతో కూరగాయలు, పండ్లకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిరసనలు ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత దిగజారుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.