ఇండోర్: వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ప్లేయర్లకు ఇండియా వీసాలు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని ఐసీసీ సోమవారం వెల్లడించింది. వరల్డ్‌కప్ వామప్ మ్యాచ్‌ల కోసం తమ టీమ్ హైదరాబాద్‌కు వెళ్లడం ఆలస్యం కావడంపై పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీతో తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తిన కొన్ని గంటల తర్వాత ఐసీసీ నుంచి ప్రకటన వచ్చింది. బుధవారం తెల్లవారుజామున లాహోర్ నుంచి దుబాయ్ మీదుగా పాక్ హైదరాబాద్ చేరుకోనుంది. ఈ నెల 29న ఉప్పల్‌లో న్యూజిలాండ్‌తో తమ తొలి వామప్ మ్యాచ్ ఆడనుంది. అయితే, వీసా క్లియరెన్స్‌పై ఇండియా హైకమిషన్ నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని పీసీబీ ప్రతినిధి ఉమర్ ఫరూక్ తెలిపారు. సకాలంలో వీసాలు రాకపోవడంతో హైదరాబాద్ వచ్చేముందుదుబాయ్‌లో ప్లాన్ చేసిన రెండు రోజుల టీమ్ బాండింగ్ సెషన్‌ను పాక్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. కాగా పాక్.. హైదరాబాద్‌లో రెండు వామప్ గేమ్స్ (27న కివీస్‌తో, అక్టోబర్ 3న ఆస్ట్రేలియాతో), రెండు వరల్డ్ కప్ మ్యాచ్‌లు (6న నెదర్లాండ్స్‌తో, 10న శ్రీలంకతో) పోటీ పడనుంది. అనంతరం బాబర్ సేన అహ్మదాబాద్ వెళ్తుంది. అక్టోబర్ 14న నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియాతో పోటీపడనుంది.