ఆసియా కప్ సూపర్-4లో భాగంగా నేడు కీలక పోరుకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో పాకిస్థాన్ జట్టు తలపడనుంది. కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం ఆతిధ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఓడిన జట్టు మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇప్పటికే భారత్ ఆసియా కప్ ఫైనల్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచుకు ముందే పాకిస్థాన్ జట్టు ప్లేయింగ్ 11 ప్రకటించేసింది. పాక్ జట్టులో ఏకంగా 5 మార్పులు చేయడం గమనార్హం.
ఆ అయిదుగురు అవుట్
నేడు శ్రీలంకతో కీలకమైన మ్యాచుకి పాక్ జట్టు దిక్కుతోచని స్థితిలో నిలిచింది. టీమిండియాతో జరిగిన మ్యాచులో హారిస్ రౌఫ్, నజీమ్ షా,అఘ సల్మాన్ గాయపడగా.. ఆల్ రౌండర్ ఫహీమ్ అష్రాఫ్, ఫకర్ జమాన్ ని పాకిస్థాన్ జట్టు పక్కన పెట్టేసింది. దీంతో ఒక్క మ్యాచుకు పాకిస్థాన్ జట్టు 5 మార్పులతో నేడు లంకపై ఆడబోతుంది. మ్యాచుకు ముందు టీమిండియాని రెచ్చగొట్టిన పాక్ జట్టుకి చివరికి ఇలాంటి గతి పడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. మరోవైపు శ్రీలంక ప్లేయింగ్ 11 ని ప్రకటించాల్సి ఉంది.
భారత్ తో ఫైనల్ ఆడేది ఎవరు
ఆసియా కప్ లో నేడు ఒకరకంగా సెమీ ఫైనల్ జరగనుంది. ఆతిధ్య శ్రీలంక ఈ మ్యాచులో ఫేవరేట్ గా కనిపిస్తుంది. సొంతగడ్డపై ఆడుతుండడం ఆ జట్టుకి కలిసి రానుంది. మరో వైపు 5 మార్పులతో బరిలోకి దిగుతున్న పాక్ ఏ మేరకు రాణిస్తుందో ఆసక్తికరంగా మారింది. మొత్తానికి భారత్ తో ఆసియా కప్ ఫైనల్ ఎవరు ఆడతారో నేడు తేలిపోనుంది.