- దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు పీటీఐపై ఆరోపణలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్’ (పీటీఐ)పై నిషేధం విధించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆ పార్టీ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలున్నాయని ఆరోపించింది. సోమవారం ఇస్లామాబాద్ లో పాక్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘పీటీఐపై నిషేధం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆ పార్టీపై నిషేధం విధించడానికి స్పష్టమైన ఆధారాలున్నాయి. పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వం త్వరలోనే చర్యలను తీసుకుంటుంది”అని తెలిపారు. దీనిపై పీటీఐ ప్రతినిధి రవూఫ్ హసన్ స్పందించారు. ‘‘పార్టీని నిషేధించాలనే ప్రభుత్వ ప్రయత్నాలను సహించబోం. వాటిని అడ్డుకుంటాం. పీటీఐ గతంలో కంటే శక్తిమంతంగా మారింది” అని చెప్పారు. కాగా, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ 1996లో పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (PTI) పార్టీని స్థాపించారు. 2018లో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇమ్రాన్ ప్రధానిగా 2018 నుంచి 2022 వరకు పని చేశారు.