ముల్తాన్ వేదికగా వెస్టిండీస్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో వికెట్ల వర్షం కురిసింది. ఇరు జట్లలో బౌలర్లు విజృంభించడంతో తొలి రోజు ఏకంగా రెండు జట్లు ఆలౌట్ కావడం విశేషం. మొదట వెస్టిండీస్ ఆ తర్వాత పాకిస్థాన్ కనీసం రెండు వందల మార్క్ చేరుకోలేకపోయాయి. దీంతో తొలి రోజే ఆట ఆసక్తికరంగా మారింది. తొలి రోజు ఆట ముగి సేసమయానికి పాకిస్థాన్ 154 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో వెస్టిండీస్ కు తొలి ఇన్నింగ్స్ లో 9 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
మొదట బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 163 పరుగులకే ఆలౌట్ అయింది. ఒకదశలో 54 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోత్ కష్టాల్లో పడిన వెస్టిండీస్ జట్టును లోయర్ ఆర్డర్ ఆదుకున్నారు. గుడాకేష్ మోతీ 55 పరుగులు చేసి జట్టును ఆదుకోగా.. కెమర్ రోచ్,జోమెల్ వారికన్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివరి రెండు వికెట్లను వెస్టిండీస్ ఏకంగా 109 పరుగులు జోడించడం విశేషం. మోతీ, రోచ్ 9 వికెట్ కు 41 పరుగులు జోడించగా.. చివరి వికెట్ కు 68 పరుగులు రాబట్టింది. పాకిస్థాన్ బౌలర్లలో నోమన్ అలీ 6 వికెట్లు పడగొట్టగా.. సాజిద్ ఖాన్ 2 వికెట్లు తీసుకున్నాడు. కషీఫ్ అలీ,అబ్రార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.
ALSO READ | ICC: కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. 2024 అత్యుత్తమ టీ20 జట్టు ఇదే
తొలి ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ కేవలం 154 పరుగులకే కుప్పకూలింది. మహ్మద్ రిజ్వాన్ (49), సౌద్ షకీల్(32) మినహా మిగిలిన వారందరూ విఫలమయ్యారు. 4 వికెట్ల నష్టానికి 119 పరుగులతో పటిష్టంగా కనిపించిన పాకిస్థాన్ చివరి 6 వికెట్లను 35 పరుగుల తేడాతో కోల్పోయింది. జోమెల్ వారికన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. గుడాకేష్ మోతీ మూడు వికెట్లు తీసుకోగా..కెమర్ కు రోచ్ రెండు వికెట్లు దక్కాయి.