పాక్​లో ట్రెయిన్ హైజాక్ చేసి 30 మంది పాక్ ఆర్మీ జవాన్లను కాల్చేశారు

పాక్​లో ట్రెయిన్ హైజాక్ చేసి 30 మంది పాక్ ఆర్మీ జవాన్లను కాల్చేశారు
  • ట్రాక్ పేల్చేసి, ట్రెయిన్​ను కంట్రోల్​లోకి తీసుకున్న బలూచ్ మిలిటెంట్లు 
  • రైలులోని 30 మంది పాక్ ఆర్మీ సిబ్బంది కాల్చివేత..మహిళలు, పిల్లలు విడుదల
  • హైజాక్ సమయంలో రైలులో 500 మంది ప్యాసింజర్లు
  • 214 మందిని బందీలుగా పట్టుకున్నామన్న మిలిటెంట్లు
  • పర్వత ప్రాంతంలో 17 టన్నెల్స్.. 8వ టన్నెల్ వద్ద రైలు హైజాక్
  • రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ఆర్మీ

ఇస్లామాబాద్: పాకిస్తాన్​లో బలూచిస్తాన్ మిలిటెంట్లు ఓ ట్రెయిన్​ను హైజాక్ చేశారు. ఎత్తయిన పర్వతాలతో కూడిన ప్రాంతంలోని ఓ టన్నెల్ వద్ద బాంబులతో ట్రాక్​ను పేల్చేసిన మిలిటెంట్లు.. ట్రెయిన్​పైకి కాల్పులు జరుపుతూ దానిని అధీనంలోకి తీసుకున్నారు. ట్రెయిన్​లోని వందలాది మందిని బందీలుగా పట్టుకున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు బలూచిస్తాన్ ప్రావిన్స్​లోని క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంక్వా ప్రావిన్స్​లోని పెషావర్​కు బయలుదేరిన జాఫర్ ఎక్స్ ప్రెస్​ను మిలిటెంట్లు హైజాక్ చేశారని, ఆ సమయంలో ట్రెయిన్​లో దాదాపు 450 మంది ప్యాసింజర్లు ఉన్నారని రైల్వే అధికారులు ప్రకటించారు. అయితే, మహిళలు, వృద్ధులు, పిల్లలు, బలూచ్ తెగ ప్రజలందరినీ తాము సురక్షితంగా విడిచిపెట్టామని, ఆర్మీ, పోలీస్, ఇతర భద్రతా బలగాలకు చెందిన 214 మందిని మాత్రమే బందీలుగా పట్టుకున్నామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) మిలిటెంట్లు ప్రకటించారు. ఎదురు తిరిగిన 30 మంది ఆర్మీ జవాన్లను చంపేశామని, తమపై భద్రతా బలగాలు కాల్పులకు దిగితే బందీలందరినీ చంపేస్తామని హెచ్చరించారు.

టన్నెల్ వద్ద ట్రాకును పేల్చేసి.. 

బలూచిస్తాన్ ప్రావిన్స్ బోలాన్ జిల్లా పర్వత ప్రాంతంలో మొత్తం 17 టన్నెల్స్ ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మిలిటెంట్లు 8వ టన్నెల్ వద్ద రైలును ఆపేసి, ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారని తెలిపారు. ఈ దాడికి బీఎల్ఏకి చెందిన మాజీద్ బ్రిగేడ్, స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్ (ఎస్టీవోఎస్), ఫతే స్క్వాడ్- స్పెషలైజ్డ్ యూనిట్లు నాయకత్వం వహించిట్లు మిలిటెంట్లు ప్రకటించారు. బందీలుగా ఉన్నవారిలో పాకిస్తాన్ సైన్యంలోని సిబ్బంది, పలువురు పోలీసులు, ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎఫ్), ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఏ) సిబ్బంది ఉన్నారని తెలిపారు. వారందరూ సెలవుపై పంజాబ్ వెళ్తుండగా అటాక్ చేసినట్టుగా తెలుస్తోంది. ట్రెయిన్ బోలాన్ జిల్లాలోని ముష్కాఫ్ ఏరియాకు చేరుకోగానే మిలిటెంట్లు ముందుగా రైల్వే ట్రాక్ పేల్చివేశారు. దాంతో జాఫర్ ఎక్స్‌‌ప్రెస్ నిలిచిపోయింది. వెంటనే మిలిటెంట్లు ట్రెయిన్​ను తమ కంట్రోల్​లోకి తెచ్చుకున్నారు. అందులోని ప్రయాణికులందరినీ బంధించారు. ఎదురుతిరిగిన సైనికులను కాల్చి చంపారు. కాగా, పాక్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఓ బోగీలోని 80 మందిని కాపాడిందని అధికారులు తెలిపారు.

స్వయంప్రతిపత్తి కోసం మిలిటెంట్ల డిమాండ్​

పాకిస్తాన్ భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బందీలను విడిపించేం దుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. రైలులోని 9 బోగీల్లో దాదాపు 450 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఎవరితోనూ తాము కాంటాక్ట్ అవ్వలేకపోతున్నామని చెప్పారు. బలూచ్​ ప్రభుత్వం స్థానికంగా ఎమర్జెన్సీ విధించిందని ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రిండ్ పేర్కొన్నారు. పాక్​​లో దక్షిణాదిన, ఇరాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో, అపార ఖనిజ సంపదతో కూడిన బలూచిస్తాన్​కు స్వయంప్రతిపత్తి కోసం మిలిటెంట్లు ఏండ్లుగా పోరాడుతున్నారు. బలూచ్ ప్రజలకు ప్రత్యేక అధికారాలు కావాలన్న డిమాండ్​తో మిలిటెంట్లు 2000లో బీఎల్ఏ ఏర్పాటు చేసి, పాక్ సైన్యంపై దాడులు చేస్తున్నారు. బలూచ్​​కు చెందిన రాజకీయ ఖైదీలందరినీ 48 గంటల్లో విడిచిపెట్టాలని కూడా బీఎల్ఏ డిమాండ్ చేసింది.