పాకిస్తాన్ ట్రైన్ను హైజాక్ చేసిన.. 33 మంది మిలిటెంట్లు హతం.. 346 మంది బందీలకు విముక్తి

పాకిస్తాన్ ట్రైన్ను హైజాక్ చేసిన.. 33 మంది మిలిటెంట్లు హతం.. 346 మంది బందీలకు విముక్తి

పాకిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ హైజాక్ ఎపిసోడ్ ముగిసింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA).. మిలిటెంట్ల చెర నుంచి 346 మంది బందీలను పాకిస్తాన్ సైన్యం విముక్తులను చేసింది. ఈ ఆపరేషన్ ముగిసే సమయానికి దురదృష్టవశాత్తూ బందీలుగా చిక్కిన ప్రయాణికుల్లో 21 మంది మరణించినట్లు పాక్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. 33 మంది మిలిటెంట్లను పాక్ సైన్యం హతమార్చింది. 

అంతటితో బుధవారం సాయంత్రానికి ఈ ఆపరేషన్ ముగిసిందని పాక్ మీడియా తెలిపింది. పాకిస్తాన్లో బలూచిస్తాన్ మిలిటెంట్లు ట్రెయిన్ను హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. ఎత్తయిన పర్వతాలతో కూడిన ప్రాంతంలోని ఓ టన్నెల్ వద్ద బాంబులతో ట్రాక్ను పేల్చేసిన మిలిటెంట్లు.. ట్రెయిన్​పైకి కాల్పులు జరుపుతూ దానిని అధీనంలోకి తీసుకున్నారు. ట్రెయిన్లోని వందలాది మందిని బందీలుగా పట్టుకున్నారు. 

మంగళవారం ఉదయం 9 గంటలకు బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంక్వా ప్రావిన్స్లోని పెషావర్కు బయలుదేరిన జాఫర్ ఎక్స్ప్రెస్ను మిలిటెంట్లు హైజాక్ చేశారు. ఆ సమయంలో ట్రెయిన్లో దాదాపు 400 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. పాక్లో దక్షిణాదిన, ఇరాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో, అపార ఖనిజ సంపదతో కూడిన బలూచిస్తాన్కు స్వయంప్రతిపత్తి కోసం మిలిటెంట్లు ఏండ్లుగా పోరాడుతున్నారు. బలూచ్ ప్రజలకు ప్రత్యేక అధికారాలు కావాలన్న డిమాండ్తో మిలిటెంట్లు 2000లో బీఎల్ఏ ఏర్పాటు చేసి, పాక్ సైన్యంపై దాడులు చేస్తున్నారు. 

బలూచిస్తాన్ ప్రావిన్స్ బోలాన్ జిల్లా పర్వత ప్రాంతంలో మొత్తం 17 టన్నెల్స్ ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మిలిటెంట్లు 8వ టన్నెల్ వద్ద రైలును ఆపేసి, ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారని తెలిపారు. ఈ దాడికి బీఎల్ఏకి చెందిన మాజీద్ బ్రిగేడ్, స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్ (ఎస్టీవోఎస్), ఫతే స్క్వాడ్- స్పెషలైజ్డ్ యూనిట్లు నాయకత్వం వహించిట్లు మిలిటెంట్లు ప్రకటించారు.

బందీలుగా ఉన్నవారిలో పాకిస్తాన్ సైన్యంలోని సిబ్బంది, పలువురు పోలీసులు, ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎఫ్), ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఏ) సిబ్బంది ఉన్నారని తెలిపారు. వారందరూ సెలవుపై పంజాబ్ వెళ్తుండగా అటాక్ చేసినట్టుగా తెలుస్తోంది. ట్రెయిన్ బోలాన్ జిల్లాలోని ముష్కాఫ్ ఏరియాకు చేరుకోగానే మిలిటెంట్లు ముందుగా రైల్వే ట్రాక్ పేల్చివేశారు. దాంతో జాఫర్ ఎక్స్‌‌ప్రెస్ నిలిచిపోయింది. వెంటనే మిలిటెంట్లు ట్రెయిన్ను తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. అందులోని ప్రయాణికులందరినీ బంధించారు. ఎదురుతిరిగిన సైనికులను కాల్చి చంపారు.