పాకిస్తాన్ రైలు హైజాక్..20మంది సైనికులను చంపేశాం..బలూచిస్తాన్ టెర్రరిస్టులు

పాకిస్తాన్ రైలు హైజాక్..20మంది సైనికులను చంపేశాం..బలూచిస్తాన్ టెర్రరిస్టులు

పాకిస్తాన్ రైలు హైజాక్ చేసిన బలూచిస్తాన్ వేర్పాటు వాద టెర్రరిస్టులు 20మంది పాక్ సైనికులను చంపేసినట్లు ప్రకటించారు. మంగళవారం (మార్చి11) పాకిస్తాన్ లోని పర్వత ప్రాంతాల్లో బలూ లిబరేషన్ ఆర్మీకి చెందిన టెర్రరిస్టులు రైలును హైజాక్ చేసి దాదాపు 450 మంది ప్రయాణికులను బంధించిన విషయం తెలిసిందే.అయితే బంధించిన వారిలో మహిళలు, పిల్లలు, వృద్ధులను, బలూచిస్తాన్ పౌరులను 182మందిని విడిచిపెట్టినట్లు తెలిపారు. పాక్ సైన్యం జోక్యం గనక చేసుకుంటే బందీలుగా ఉన్న వారిని ఉరితీస్తామని ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. 

ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దులో ఉన్న బలూచిస్తాన్ స్వాతంత్ర్యం  కోసం పనిచేస్తున్న బలూ లిబరేషన్ ఆర్మీ ఈ హైజాక్ చేసింది. క్వెట్టానుంచి పెషావర్ కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ ప్రెస్ ను పాకిస్తాన్ పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఈ ప్రాంతంలో 17 సొరంగాలు ఉండగా.. 8వ నంబర్ టన్నెల్ దగ్గర సాయుధ ఉగ్రవాదులు రైలును ఆపారు. ఈ సొరంగాల లోపల రైళ్ల వేగం తరచుగా నెమ్మదిగా ఉంటుంది. రైల్వే ట్రాక్‌పై బాంబు దాడి చేసి ఆపై హైజాక్ చేసినట్లు తెలుస్తోంది. 

తిరుగుబాటుదారులకు నిలయంగా ఉన్న బలూచిస్తాన్ లో బలూచ్ జాతీయవాద ఉగ్రవాదులు ఈ ప్రావిన్స్ వనరులలో ఎక్కువ వాటాను డిమాండ్ చేస్తున్నారు. గతేడాది కరాచీ విమానాశ్రయానికి సమీపంలోని పోర్ట్ ఖాసిమ్ ఎలక్ట్రిక్ పవర్ కో దగ్గర చైనా కార్మికుల కాన్వాయ్‌ను లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడిలో ఇద్దరు చైనా జాతీయులు మృతిచెందారు.