మీ బుద్ధి ఇంతే.. ఇక మీరు మారరు: LOC వెంబడి మళ్లీ పాక్ సైనికుల కాల్పులు

మీ బుద్ధి ఇంతే.. ఇక మీరు మారరు: LOC  వెంబడి మళ్లీ పాక్ సైనికుల కాల్పులు

శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడితో పాక్, భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదులను ప్రేరేపించి జమ్మూ కశ్మీర్‎లో దాడులకు ఉసిగొల్పిన పాక్.. బార్డర్‎లోనూ తమ వక్రబుద్ధిని చూపిస్తోంది. కాల్పుల విరమణను ఉల్లఘించి నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి భారత పోస్టులపై కాల్పులు జరుపుతోంది. ఏప్రిల్ 25, 26 తేదీల మధ్య రాత్రి పాకిస్తాన్ దళాలు కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి కాల్పులు జరిపిందని భారత సైన్యం వెల్లడించింది. 

వెంటనే అలర్ట్ అయిన భారత భద్రతా దళాలు అదే రీతిలో పాక్‎కు సమాధానం ఇచ్చాయని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఎల్వోసీ వెంబడి పాక్ సైనికులు వరుసగా కవ్వింపు చర్యలకు దిగుతున్నారని పేర్కొన్నారు. ఏప్రిల్ 24 అర్థరాత్రి కూడా సీజ్ ఫైర్ ఉల్లఘించి కాల్పులకు తెగబడ్డారని అధికారులు వెల్లడించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. 

భద్రతా అప్రమత్తంగా ఉన్నాయని.. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి మూకలను ఏరివేసేందుకు భారత సైన్యం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది. జమ్ముకశ్మీర్‌ అంతటా భద్రతా దళాలు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కుల్గాం జిల్లాలోని కైమా ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదుల అనుచరులను అరెస్ట్ చేశారు.