మళ్లీ బరితెగించిన పాక్ సైన్యం.. కుప్వారా, పూంచ్ జిల్లాల్లో LOC వెంబడి మరోసారి కాల్పులు

మళ్లీ బరితెగించిన పాక్ సైన్యం.. కుప్వారా, పూంచ్ జిల్లాల్లో LOC వెంబడి మరోసారి కాల్పులు

శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్ సైన్యం బరితెగిస్తోంది. నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘింస్తోంది. వరుసగా నాలుగో రోజు (ఏప్రిల్ 28) కూడా ఎల్వోసీ దగ్గర సీజ్ ఫైర్ అగ్రిమెంట్‎కు తూట్లు పొడిచింది. సోమవారం (ఏప్రిల్ 28) తెల్లవారుజూమున జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా, పూంచ్ జిల్లాల్లో భారత సైనికుల స్థావరాలపై కాల్పులు జరిపింది పాక్ సైన్యం. పాక్ వక్రబుద్ధి ముందే తెలిసిన భారత బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే పాక్ సైనికుల కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. 

ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. వరుసగా కాల్పుల విరణమకు పాల్పడుతూ కవ్వింపులకు  దిగుతోన్న పాక్ సైన్యానికి గట్టి బుద్ధి చెబుతామని పేర్కొన్నారు. మరోవైపు.. జమ్మూ కాశ్మీర్‎లో హై అలర్ట్ కొనసాగుతోంది. పహల్గాంలో నరమేధం సృష్టించిన ఉగ్రమూకల ఏరివేత లక్ష్యంగా భారత భద్రతా దళాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. పలువురు టెర్రరిస్టులు, ఉగ్రవాద సానుభూతిపరుల ఇళ్లను ధ్వంసం చేస్తున్నారు. మరికొందరు ముష్కరుల కోసం జల్లెడ పడుతున్నాయి. 

కాగా, జమ్ముకాశ్మీర్‎లోని పహల్గాం ప్రాంతం బైసారన్ మైదాన ప్రాంతంలో మంగళవారం (ఏప్రిల్ 22) ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. కుటుంబంతో కలిసి సరదాగా టైమ్ స్పెండ్ చేసేందుకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరపారు. దీంతో 26 మంది అమాయక ప్రజలు మృతి చెందగా.. మరికొందరు బుల్లెట్ గాయాలకు తీవ్రంగా గాయపడ్డారు.