
- వర్షం వల్ల బంగ్లాదేశ్‌తో చివరి లీగ్ మ్యాచ్ రద్దు
రావల్పిండి: భారీ అంచనాలతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. ఒక్క విజయం కూడా లేకుండానే చాంపియన్స్ ట్రోఫీని ముగించింది. బంగ్లాదేశ్‌తో గురువారం జరగాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దయ్యింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వాన వల్ల గ్రౌండ్ మొత్తం చిత్తడిగా మారింది. దీంతో ఒక్క బాల్ కూడా సాధ్యపడలేదు. గ్రౌండ్ మొత్తం కవర్లతో కప్పి ఉంచారు. దాదాపు రెండు గంటల పాటు వేచి చూసిన అంపైర్లు చేసేదేమీ లేక మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
ఇప్పటికే పాక్, బంగ్లా సెమీస్‌కు దూరం కావడంతో ఈ మ్యాచ్‌కు పెద్దగా ప్రాధాన్యత లేకపోయింది. అయినప్పటికీ విజయంతో టోర్నీని ముగించాలని పాక్ భావించినా ఆ కల నెరవేరలేదు. 29 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై ఓ పెద్ద ఐసీసీ టోర్నీని నిర్వహించే అవకాశం రావడం, అందులో పాక్ ఫైనల్‌కు చేరుకోకపోవడంతో ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ వారంలో వర్షం వల్ల రద్దయిన రెండో మ్యాచ్ ఇది. ఇంతకుముందే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు కూడా వాన అడ్డంకిగా మారింది. బంగ్లాదేశ్‌ది కూడా పాక్ పరిస్థితే. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడిన బంగ్లా ఒక్క పాయింట్‌తో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
చాంపియన్స్ ట్రోఫీలో నేటి మ్యాచ్..
ఆస్ట్రేలియా X అఫ్గానిస్తాన్.. మ. 2.30 నుంచి