U-19 Asia Cup 2023: వీడెవడండీ బాబు.. కాళ్లతోనే క్యాచ్ పట్టాడు

U-19 Asia Cup 2023: వీడెవడండీ బాబు.. కాళ్లతోనే క్యాచ్ పట్టాడు

క్రికెట్ లో బ్యాటింగ్, బౌలింగ్ ద్వారా మాత్రమే మ్యాచ్ మలుపు తిరుగుతుందనుకుంటే పొరపాటే. కొన్నిసార్లు కీలక దశలో పట్టే ఒక్క గ్రేట్ క్యాచ్ మొత్తం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుంది. అత్యద్భుతమైన క్యాచ్ లతో మ్యాచ్ ను గెలిపించిన సందర్భాలు ఇప్పటివరకు మనం చాలానే చూసాం. అయితే ఆసియా కప్ అండర్-19 లో పాక్ వికెట్ కీపర్ సాద్ బేగ్ కాళ్లతో పట్టిన ఒక క్యాచ్ నమ్మశక్యం కానీ రీతిలో ఉంది.
 
దుబాయ్ వేదికగా నిన్న( డిసెంబర్ 10) భారత్, పాకిస్థాన్ మధ్య లీగ్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ మొదట బ్యాటింగ్ చేయగా ఇన్నింగ్స్ 32 ఓవర్లో విచిత్రమైన సంఘటన ఒకటి జరిగింది. ఈ ఓవర్లో పాక్ స్పిన్నర్ అరాఫత్ మిన్హాస్ బౌలింగ్ లో భారత ఓపెనర్ ఆదర్శ్ సింగ్ స్లాగ్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు.  ఈ బంతి కాస్త బ్యాట్ ఎడ్జ్  తీసుకుని మిస్ అవ్వగా పాక్ వికెట్ కీపర్  కెప్టెన్ సాద్ బేగ్ రెండు కాళ్ళతో క్యాచ్ అందుకున్నాడు.
 
ప్యాడ్ల మధ్యలో బాల్ ఇరుక్కోగా దానిని కిందపడనీయకుండా జాగ్రత్తగా చేత్తో బాల్ తీసుకుని అప్పీల్ చేయడంతో అంపైర్ ఔట్ గా ప్రకటించాడు. అప్పటికప్పుడు ఈ వికెట్ వికెట్ కీపర్ చూపిన టాలెంట్ కు అందరూ ఆశ్చర్యపోయారు. 62 పరుగులు చేసిన తర్వాత ఆదర్శ్ అవుట్ కావడంతో భారత్ పతనం స్టార్ట్ అయింది. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవరల్లో కేవలం 259 పరుగులు మాత్రమే  చేయగలిగింది. ఆదర్శ్ తో పాటు కెప్టెన్ ఉదయ శరన్(60), సచిన్ దాస్(58) రాణించారు. 

అనంతరం 260 పరుగుల ఛేదనలో అజాన్ అవైస్(105 నాటౌట్) సెంచరీతో కదం తొక్కాడు. అతనికి మరో ఎండ్ నుంచి షాజైబ్ ఖాన్ (63), సాద్ బేగ్(68 నాటౌట్) చక్కటి సహకారాన్ని అందించారు. అజాన్ అవైస్- షాజైబ్ ఖాన్ జోడి రెండో వికెట్ కు ఏకంగా 110 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.