ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) మాజీ చీఫ్ ఫైజ్‌హమీద్‌ను ఆ దేశ ఆర్మీ కస్టడీలోకి తీసుకుంది. హౌసింగ్ స్కీమ్ కుంభకోణానికి సంబంధించి ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పాక్ ఆర్మీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. హమీద్‌పై వచ్చిన వచ్చిన ఫిర్యాదుల్లో నిజానిజాలను నిర్ధారించాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆర్మీకి ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా పాక్ ఆర్మీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఆయనపై విచారణ చేపట్టింది. అంతేకాకుండా పదవీ విరమణ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చట్టాన్ని ఆయన ఉల్లంఘించారనే ఫిర్యాదులు కూడా వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఫీల్డ్ జనరల్ కోర్ట్ మార్షల్ ప్రక్రియను ప్రారంభించారు. పాకిస్తాన్‌లోని ప్రైవేట్ హౌసింగ్ స్కీమ్ అయిన టాప్ సిటీ.. హమీద్‌పై ఆరోపణలు చేసింది. టాప్ సిటీ యజమాని మోయీజ్ ఖాన్ ఆఫీసులపై, నివాసాలపై హమీద్ దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో ఆ సంస్థ పేర్కొంది. కాగా, ఈ కేసుకు సంబంధించి గత మార్చిలో రావల్పిండిలోని కోర్టు హమీద్ సోదరుడు నజాఫ్ హమీద్‌కు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.