
శ్రీనగర్: పాకిస్తాన్ సైన్యం మంగళవారం జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ)ని దాటి మన దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించింది. అకారణంగా కాల్పులు జరిపి, ఎల్ఓసీ వెంబడి ఉన్న శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అయితే, పాక్ సైన్యం జరిపిన ఈ కాల్పులకు భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. వారిపై ఎదురుకాల్పులు జరిపింది.
మంగళవారం మధ్యాహ్నం 1.10 గంటలకు పాకిస్తాన్.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. కృష్ణ ఘాటి సెక్టార్ నుంచి పాకిస్తాన్ సైన్యం మన దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిందని..ఒక ల్యాండ్‌మైన్ ను పేల్చడంతోపాటు కాల్పులకు తెగబడిందని వివరించాయి. వెంటనే అప్రమత్తమైన భారత జవాన్లు పాకిస్తాన్ సైన్యంపై ఎదురుకాల్పులు జరిపారని తెలిపాయి. ఎల్ఓసీ వెంబడి ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, అన్నిచోట్లా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పాయి. కాగా.. ఈ ఘటనలో ఐదుగురు పాకిస్తాన్ జవాన్లు గాయపడినట్లు సమాచారం.