ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం- 2019 (సీఏఏ) అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం కింద గోవాలో నివసిస్తున్న 78 ఏళ్ల పాకిస్థానీ క్రైస్తవుడు జోసెఫ్ ఫ్రాన్సిస్ పెరీరాకు భారత పౌరసత్వం లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆయనకు పౌరసత్వ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. దాంతో, గోవా నుంచి పౌరసత్వం అందుకున్న మొదటి వ్యక్తిగా పెరీరా రికార్డుల్లో తన పేరు లిఖించుకున్నారు.
CAA కింద దరఖాస్తు చేసుకున్న ఒక నెల తర్వాత తనకు పౌరసత్వం లభించిందని జోసెఫ్ పెరీరా తెలిపారు. 1946లో జన్మించిన జోసెఫ్ ఫ్రాన్సిస్ పెరీరా ఉన్నత చదువుల కోసం 1960లో పాకిస్థాన్‌కు వెళ్లారు. దాంతో, ఆయనకు ఆ దేశ పౌరసత్వం లభించింది. అనంతరం 37 ఏళ్ల పాటు బహ్రెయిన్‌లో పనిచేశారు. 2013లో పదవీ విరమణ పొందాక తన కుటుంబంతో నివసించడానికి గోవాకు తిరిగి వచ్చారు. ఆయన భార్య మార్తా పెరీరా భారత పౌరురాలు.
ALSO READ | Free Aadhar Update: ఫ్రీ ఆధార్ అప్డేట్ గడువు ముగుస్తోంది.. వెంటనే అప్డేట్ చేసుకోండి..
వివాహం అయిన నాటి నుండి తాను పౌరసత్వం పొందడానికి ప్రయత్నిస్తున్నామని జోసెఫ్ తెలిపారు. ఆ కల నెలవేరేలా చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలకుఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఏంటి ఈ చట్టం..?
మతపరమైన హింస కారణంగా పాకిస్థాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి భారతదేశానికి వలసొచ్చి శరణార్థులుగా ఉంటున్న హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవ మైనారిటీలకు భారత పౌరసత్వం ఇవ్వడం ఈ చట్టం ఉద్దేశ్యం. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి భారత్‌కు వచ్చిన వారికి మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టంలో ముస్లింలకు పౌరసత్వం కల్పించే నిబంధన లేదు.