హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీయుడు.. పాక్ నుంచి నేపాల్ మీదుగా సిటీలోకి ఎంట్రీ

హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీయుడు.. పాక్ నుంచి నేపాల్ మీదుగా సిటీలోకి ఎంట్రీ

హైదరాబాద్: పాకిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కి చెందిన యువతిని వివాహం చేసుకున్న ఈ పాకిస్తానీ ఆమెను కలిసేందుకు హైదరాబాద్ చేరుకున్నాడు. యువతిని కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు చేరుకున్న మహమ్మద్ ఫయాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఫయాజ్ దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది.

పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదుల పొట్టనపెట్టుకున్న తర్వాత భారత్, పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజధానిలో 208 మంది పాకిస్తాన్ పౌరులున్నట్టు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. పహెల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దాయాది దేశంపై భారత్ అనేక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ వాసులకు జారీ చేసిన వీసాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

ఏప్రిల్ 27 నుంచి పాకిస్తాన్ వారి వీసాలన్నీ రద్దు అయినట్లేనని విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రకటించింది. పాక్ జాతీయులకు జారీ చేసిన మెడికల్ వీసాలు మాత్రం ఏప్రిల్ 29వ తేదీ వరకు చెల్లుబాటు అవుతాయని కేంద్రం తెలిపింది. వీసాల గడువు ముగిసే లోగా భారత్లో ఉన్న పాక్ పౌరులంతా దేశాన్ని వీడాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో హైదరాబాద్లో ఎంత మంది పాకిస్తానీలు ఉన్నారనే చర్చ తెరపైకి వచ్చింది.

హైదరాబాద్లో మొత్తం 208 మంది పాకిస్తానీలు ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 156 మందికి లాంగ్ టర్మ్, 13మందికి షార్ట్ టర్మ్, 39 మందికి బిజినెస్ వీసాలు ఉన్నట్లు తేలింది. దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ ఫోన్ చేశారు. రాష్ట్రంలోని పాక్ దేశస్తులను వెంటనే గుర్తించి వెనక్కి పంపించాలని, స్థానికంగా ఉంటున్న వారి డేటాను కేంద్రానికి పంపాలని కోరారు.