పోలీసుల అదుపులో ముగ్గురు పాకిస్తానీయులు!

పోలీసుల అదుపులో ముగ్గురు పాకిస్తానీయులు!
  • వారిపై కేసులున్న నేపథ్యంలో తదుపరి చర్యలపై అధికారుల చర్చలు!

హైదరాబాద్, వెలుగు: రెండేండ్లుగా పాతబస్తీలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్‌‌ యువకుడు మహ్మద్ ఫయాజ్‌‌(26)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ చొరబాటు కేసులో ఇప్పటికే అతను కోర్టు విచారణకు హాజరవుతున్నాడు. అయితే, పహల్గాం దాడి ఘటన నేపథ్యంలో పాకిస్తానీయులంతా దేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించడంతో  సౌత్‌‌జోన్ పోలీసులు.. ఫయాజ్‌‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కేసుపై కోర్టు విచారణ ఉండడంతో పాటు భార్య, కొడుకు హైదరాబాద్‌‌కు చెందిన వారే కావడంతో ఫయాజ్‌‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధికారులు చర్చిస్తున్నారు. 

ఫయజ్‌‌.. హైదరాబాద్ కిషన్‌‌బాగ్‌‌ అసద్‌‌ బాబానగర్‌‌‌‌కు చెందిన నేహా ఫాతిమాను 2009లో  దుబాయ్‌‌లో  ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. వీరికో కొడుకు ఉన్నాడు. రెండేండ్ల క్రితమే నేహా ఫాతిమా తన కొడుకుతో సహా హైదరాబాద్‌‌కు తిరిగి వచ్చింది.  భార్య కోసం 2022 నవంబర్‌‌‌‌లో ఫయాజ్‌‌  చైనా మీదుగా నేపాల్ ఖాట్మాండూ వచ్చాడు. అక్కడి నుంచి రైల్లు, బస్సుల్లో ట్రావెల్ చేస్తూ హైదరాబాద్ చేరుకున్నాడు. అత్తమామల సహకారంతో మహ్మద్ గౌస్‌‌ పేరిట ఇక్కడే బర్త్‌‌ సర్టిఫికెట్‌‌ తీసుకున్నాడు. ఫయజ్‌‌ గురించి సమాచారం అందుకున్న బహదూర్‌‌‌‌పుర పోలీసులు.. 2023 సెప్టెంబర్‌‌‌‌లో అరెస్ట్ చేశారు. మళ్లీ శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.

కస్టడీలో మరో ఇద్దరు పాకిస్తానీలు 

ఫయాజ్ కాకుండా సిటీ పోలీసుల కస్టడీలో మరో ఇద్దరు పాకిస్తానీలు ఉన్నారు. గత కొంతకాలంగా వివిధ నేరాల్లో అరెస్ట్‌‌ అయిన వీరిద్దరు..జైళ్లలో కాకుండా ప్రత్యేక కస్టడీలో ఉన్నారు. వీరిని కూడా తరలించేందుకు పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే కేసులు విచారణలో ఉన్న సంబంధిత కోర్టులను అధికారులు ఆశ్రయించనున్నట్లు తెలిసింది. కేంద్ర గైడ్‌‌లైన్స్‌‌ మేరకు ఈ ముగ్గురు పాకిస్తానీలను బోర్డర్‌‌‌‌ దాటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మహ్మద్ ఫయాజ్‌‌ సహా ముగ్గురు పాకిస్తానీలను ఎలా తరలించాలనే విషయంలో పోలీసులు అయోమయానికి గురవుతున్నారు.