ఇరాన్‌లోని యాజ్ద్ ప్రావిన్స్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 28 మంది పాకిస్తానీ యాత్రికులు మరణించగా.. మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇరాన్ ప్రభుత్వాధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 53 మంది యాత్రికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
అసలేం జరిగింది..?
ముహమ్మద్ ప్రవక్త మనవడు హుస్సేన్ ఇబ్న్ అలీ మరణానికి గుర్తుగా మతపరమైన ఆచారాల్లో పాల్గొనేందుకు 53 మంది పాకిస్తానీలు.. ఇరాన్‌కు షియా యాత్రకు బయల్దేరి వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు మధ్య ఇరాన్‌లోని టాఫ్ట్ నగరానికి సమీపంలో మంగళవారం రాత్రి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 28 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. మరో 23 మంది గాయపడినట్లు ఐఆర్‌ఎన్‌ఏ వార్తా సంస్థ నివేదించింది. మృతుల్లో 11 మంది మహిళలు, 17 మంది పురుషులు ఉన్నట్లు అధికారులు నివేదించారు.
ఈ ప్రమాదంలో 14 మంది తీవ్రంగా గాయపడగా.. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సు బ్రేకింగ్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటన నుంచి ఇద్దరు మత్రమే సురక్షితంగా బయటపడ్డారని ఇరాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 500 కిలోమీటర్లు (310 మైళ్లు) దూరంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.