బట్టలపై ఖురాన్ రాతలంటూ మహిళపై దాడి.. ఆ ఏఎస్పీకి హ్యాట్సాప్

పాకిస్తాన్ రాజధాని లాహోర్ లో సిటీలో.. ఓ మహిళ తన కుటుంబంతో కలిసి ఓ రెస్టారెంట్ కు వచ్చింది. ఆ మహిళ ధరించిన దుస్తులపై ఖురాన్ అక్షరాలు ఉన్నాయంటూ ఓ వ్యక్తి.. మత పెద్దలకు సమాచారం ఇచ్చాడు.. అంతే నిమిషాల్లోనే వార్త వైరల్ అయ్యింది.. గుంపులు గుంపులుగా జనం రెస్టారెంట్ దగ్గర పోగయ్యారు.. కొందరు మత విశ్వాస పరులు అయితే ఆ మహిళను కొట్టటం ఒక్కటే తక్కువ.. బూతులు తిడుతూ.. దాడికి ప్రయత్నించారు. విషయం పోలీసులకు చేరటంతో పెద్ద ప్రమాదం తప్పింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

2024, ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం లాహోర్ సిటీలోని అచ్రా మార్కెట్ ఏరియాలో షాపింగ్ అనంతరం.. ఓ మహిళ రెస్టారెంట్ కు వెళ్లింది. అప్పటికే ఆ రెస్టారెంట్ లో ఉన్న కొందరు వ్యక్తులు.. ఆ మహిళ ధరించిన దుస్తులపై ఖురాన్ శ్లోకాలు ఉన్నాయంటూ గొడవకు దిగారు. తమ పెద్దలతోపాటు స్థానికంగా ఉన్న ఆకతాయిలకు ఫోన్లు చేశారు. ఈ విషయంతో రెస్టారెంట్ కు వందలాది మంది తరలివచ్చారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అత్యంత వేగంగా స్పందించారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మహిళా అధికారి అయిన షెహర్బానీ స్పాట్ కు వచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో.. ఆందోళనకారులతో మాట్లాడారు. రెస్టారెంట్ లో ఉన్న యువతికి ఎలాంటి హాని చేయొద్దని.. దాడి చేయొద్దని.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని హామీ ఇస్తూ.. ఆందోళనకారులను కూల్ చేశారు. 

రెస్టారెంట్ లో ఉన్న మహిళకు బురఖా వేసి.. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తరలించారు. ఆమె ధరించిన దుస్తులను పరీక్షించగా.. అసలు ఖురాన్ శ్లోకాలు కావని.. అరబిక్ భాషలోని ఖురాన్ శ్లోకాలు కావని నిర్థారించారు. ఆన్ లైన్ లో ఆ మహిళ ఈ దుస్తులను కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. కొంత ఆకతాయిలు మతం పేరుతో ఇలాంటి అలజడి సృష్టించారని స్పష్టం చేశారు ఏఎస్పీ షెహర్బానీ. 

ఇంత పెద్ద విషయాన్ని,, సున్నితమైన అంశాన్ని అత్యంత తెలివితో శాంతియుతంగా పరిష్కరించిన ఏఎస్పీ షెహర్బానీని లాహోర్ మహిళలు జేజేలు పలుకుతున్నారు. మతం పేరుతో విధ్వంసం చేసే వాళ్లకు ఇది గుణపాఠం అంటున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్తానీ మహిళలు డిమాండ్ చేస్తున్నారు.