ఇస్లామాబాద్: సీమా హైదర్, అంజు తరహాలో మరో సరిహద్దు ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో పరిచయమైన ఇండియన్ కోసం 25 ఏండ్ల పాకిస్తానీ యువతి అంతర్జాతీయ సరిహద్దును దాటింది. పాకిస్తాన్ ఇస్లామాబాద్‌కు చెందిన మెహ్విష్ ఉమ్రాకు, లాహోర్‌కు చెందిన పాకిస్తానీ వ్యక్తితో 12 ఏండ్ల క్రితం పెండ్లి అయ్యింది. ఈ దంపతులకు12, 7 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. 2018లో ఇద్దరూ విడిపోయారు. అనంతరం మెహ్విష్ కు సోషల్ మీడియా ద్వారా రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాకు చెందిన రెహ్మాన్( కువైట్‌లో ట్రాన్స్‌పోర్టర్‌గా పనిచేస్తున్నాడు) పరిచయం అయ్యాడు.
చాటింగులు, వీడియో కాల్స్ తో మొదలైనవారి స్నేహం కాస్త ప్రేమగా మరింది. దాంతో 2022 మార్చి13న వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఇద్దరూ పెండ్లి చేసుకున్నారు. తరువాత 2023లో మక్కా తీర్థయాత్ర సమయంలో ఇద్దరూ మళ్లీ అధికారికంగా వివాహం చేసుకున్నారు. పెండ్లి తర్వాత మెహ్విష్ ఇస్లామాబాద్ కు వెళ్లింది. రెహ్మాన్ రాజస్థాన్ చురులోని తన సొంతూరు పితిసర్ వెళ్లిపోయాడు. అయితే, మెహ్విష్ టూరిస్ట్ వీసాతో ఇస్లామాబాద్ నుంచి లాహోర్‌కు వెళ్లి, అక్కడి నుంచి జులై 25న వాఘా సరిహద్దు గుండా భారత్‌లోకి ప్రవేశించింది. మెహ్విష్, రెహ్మాన్ పెండ్లని అతని కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. పితిసర్లోని తమ ఇంటికి మెహ్విష్‌ను తీసుకెళ్లారు.
పెరుగుతున్న సరిహద్దు లవ్ స్టోరీలు
ఇటీవలి కాలంలో సరిహద్దు ప్రేమకథలు పెరిగిపోయాయి. పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్ తన భర్తను విడిచిపెట్టి, తన లవర్ ను వివాహం చేసుకోవడానికి సరిహద్దు దాటి భారతదేశంలోకి ప్రవేశించింది. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. ఆ తర్వాత అంజు అనే భారతీయ మహిళ తన ప్రేమికుడు నస్రుల్లా కోసం పాకిస్థాన్ వెళ్లింది. ఈ ఉదంతం కూడా చర్చనీయాంశమైంది. తర్వాత 19 ఏళ్ల పాకిస్తాన్ యువతి ఇక్రా జీవాని ఆన్‌లైన్ గేమ్ లూడోలోలో పరిచయమైన ములాయం సింగ్ యాదవ్(21) కోసం ఇండియాకు వచ్చేసింది. తాజా ఘటనతో జాబితాలోకి ఇప్పుడు మెహ్విష్ ఉమ్రా, రెహ్మాన్ లవ్ స్టోరీ చేరిపోయింది.