- పాకిస్తాన్ కు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
- హైదరాబాద్ యువతితో దుబాయిలో ప్రేమ పెళ్లి
- అల్లుడిని సిటీకి రప్పించేందుకు అత్తామామ ప్లాన్
- ఆధార్‌కార్డ్ కోసం నకిలీ బర్త్ సర్టిఫికెట్ తో ఎన్‌రోల్
- సమాచారం అందగా బహదూర్ పురా పోలీసులు సెర్చ్
- అల్లుడు రిమాండ్, పరారీలో అత్త మామలు
హైదరాబాద్, వెలుగు : పాతబస్తీలో అక్రమంగా నివాసముంటున్న పాకిస్తాన్ యువకుడు మహ్మద్ ఫయజ్(24) ను బహదూర్ పురా పోలీసులు అరెస్టు చేశారు. సౌత్ జోన్ డీసీపీ సాయిచైతన్య తెలిపిన వివరాల ప్రకారం.. ఫయజ్ తన భార్య, కొడుకు కోసం వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. అతడి నుంచి పాకిస్తాన్‌కు చెందిన పాస్‌పోర్ట్, నేపాల్ నుంచి ఇండియాకు ట్రావెల్ చేసిన ఫ్లైట్, బస్, టికెట్స్,14 రైలు టికెట్స్, ఫేక్ బర్త్ సర్టిఫికెట్ ను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ యువతితో ప్రేమ పెళ్లి
పాకిస్తాన్ లోని షంగత్ జిల్లా స్వత్ గ్రామానికి చెందిన మహ్మద్ ఫయజ్ 2018 డిసెంబర్‌లో దుబాయ్ వెళ్లాడు. షార్జాలోని సైఫ్ జోన్‌లోని డిజర్ట్ స్టూడియో గార్మెంట్స్ కంపెనీలో స్టిచ్చింగ్, ఫినిషింగ్ డిపార్ట్ మెంట్‌లో పని చేసేవాడు. అక్కడే 2019లో హైదరాబాద్ కిషన్‌బాగ్ అసద్ బాబానగర్‌కు చెందిన నేహ ఫాతిమా(19)తో పరిచయం ఏర్పడింది. ఆమెకు మిలీనియం ఫ్యాషన్ ఇండస్ట్రీలో టైలర్‌గా అతడు జాబ్ ఇప్పించాడు. కొంతకాలం తర్వాత ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకోగా.. మూడేండ్ల బాబు ఉన్నాడు. రెండేండ్ల కిందట నేహఫాతిమా తన కొడుకును తీసుకుని హైదరాబాద్‌కు వచ్చింది. ఫయద్ అక్కడే ఉంటూ.. ఫోన్‌లో భార్య, కొడుకుతో మాట్లాడుతుండేవాడు. నేహ ఫాతిమా తల్లిదండ్రులు జుబేర్ షేక్, అఫ్జల్ బేగం ఇండియాకు రావాలని అల్లుడు ఫయజ్‌ను కోరారు. ఇక్కడ ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని, ఆధార్ కార్డుతో పాటు స్థానికుడిగా గుర్తించేందుకు ఇతర డాక్యుమెంట్లు సమకూర్చుతామని చెప్పారు. దీంతో గతేడాది నవంబర్‌లో ఫయాజ్ పాకిస్తాన్ పాస్ పోర్ట్ తో చైనా మీదుగా నేపాల్ లోని ఖాట్మాండుకు చేరాడు. అప్పటికే అల్లుడి కోసం అత్తమామలు ఇండో–నేపాల్ బోర్డర్‌లో ఎదురుచూశారు. బోర్డర్ అధికారులను మేనేజ్ చేశారు. ఎలాంటి వీసా లేకుండానే ఫయజ్‌ను బోర్డర్ దాటించి ఇండియాలోకి తీసుకొచ్చారు. రైలు, బస్సుల్లో ట్రావెల్ చేస్తూ హైదరాబాద్ చేరారు. కిషన్‌బాగ్‌లోని ఎన్‌ఎంగూడలో అల్లుడికి నివాసం ఏర్పాటు చేశారు.
అత్తమామలే తల్లిదండ్రులుగా..
గతేడాది నవంబర్ నుంచి ఫయజ్ భార్యతో కలిసి ఉంటున్నాడు. బల్దియా సర్కిల్ –7లోని డాక్టర్ అజీమ్ ఖాసీమ్ సహకారంతో మహ్మద్ గౌస్ పేరుతో బర్త్ సర్టిఫికెట్ సంపాదించారు. అందులో తల్లిదండ్రులుగా జుబేర్ షేక్, అఫ్జల్ బేగం పేర్లను నమోదు చేయించారు. అనంతరం మాదాపూర్‌లోని ఆధార్ సెంటర్‌కి వెళ్లారు. ఫేక్ సర్టిఫికెట్‌తో ఆధార్ కార్డుకు ఎన్‌రోల్ చేయించారు. ఫయజ్ గురించి సమాచారం అందడంతో బహదూర్‌పురా పోలీసులు బుధవారం సెర్చ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. జుబేర్, అఫ్జల్ బేగం పరారీ ఉన్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో కలిసి ఫయజ్ పూర్తి వివరాలు రాబడుతున్నారు. భార్య, కొడుకు కోసం హైదరాబాద్ వచ్చి నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. వీసా లేకుండా అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించినందుకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.