ఆదివారం (జూన్ 9) ఎన్నో అంచనాల మధ్య భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అంచనాలకు తగ్గట్టు ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా జరిగింది. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఇదే రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సాద్ అహ్మద్ అనే యూట్యూబర్‌ను ఓ సెక్యూరిటీ గార్డ్ తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ అవుతుంది.
అసలేం జరిగిందంటే..?
పాకిస్థాన్, భారత్ జట్ల మధ్య మ్యాచ్ అంటే రెండు దేశాల్లో ఆ రోజు మొత్తం ఈ మ్యాచ్ గురించే టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో సాద్ అహ్మద్ అనే ఒక యూ ట్యూబ్ యువకుడు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని కరాచీలోని మార్కెట్ కు వెళ్ళాడు. మ్యాచ్ గురించి చాలా సేపు రకరకాల ప్రశ్నలతో అతని ఇంటర్వ్యూ బాగా జరిగింది. అయితే కొంతసేపటికి ఊహించని ట్విస్ట్ చేసుకుంది.
ఇంటర్వ్యూ లో భాగంగా అక్కడే ఉన్న ఓ సెక్యూరిటీ గార్డ్‌ను అతను టీమిండియా, పాక్ మ్యాచ్ గురించి అడిగాడు. అయితే సెక్యూరిటీ గార్డ్ అతని ప్రశ్నకు స్పందించలేదు. ఆ సెక్యూరిటీ గార్డ్ తప్పించుకునే ప్రయత్నం చేసినా సాద్ మాత్రం అతన్ని వదల్లేదు. అతనికి ఇష్టం లేకపోయినా రకరకాల ప్రశ్నలతో విసిగించాడు. దీంతో సహనం కోల్పోయిన ఆ సెక్యూరిటీ గార్డ్ తన వద్ద ఉన్న తుపాకీతో సాద్‌పై కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ సాద్‌ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, మార్గ మధ్యంలోనే అతడు చనిపోయినట్లు వైద్యులు చెప్పారు.