తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు.. వెంటనే పాకిస్తాన్ వెళ్లిపోవాలి: డీజీపీ జితేందర్ ఆదేశాలు

తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు.. వెంటనే పాకిస్తాన్ వెళ్లిపోవాలి: డీజీపీ జితేందర్ ఆదేశాలు

హైదరాబాద్: తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని -తెలంగాణ డీజీపీ జితేందర్ అల్టిమేటం జారీ చేశారు. పాకిస్తానీల వీసాలు 27 తర్వాత పనిచేయవని, మెడికల్ వీసాల మీద ఉన్నవారికీ ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు ఉందని ఆయన స్పష్టం చేశారు. లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన వారికి ఈ నిబంధన వర్తించదని ఆయన వివరించారు. పాకిస్థానీలు తమ దేశానికి అటారి బార్డర్ నుంచి వెళ్లొచ్చని, ఏప్రిల్ 30 వరకు అటారి బార్డర్ తెరుచుకుని ఉంటుందని ఆయన తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లిపోవాలని, ఒకవేళ అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ హెచ్చరించారు. రాష్ట్రాల్లోని పాకిస్థానీయులను గుర్తించి వెంటనే వారిని పాకిస్తాన్కు పంపాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పాకిస్తానీయులకు జారీ చేసిన అన్ని వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.

వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో  హైదరాబాద్లో ఉన్న పాకిస్తానీయులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. సిటీలో ఉన్న పాక్ పౌరుల వివరాలను సేకరించారు. హైదరాబాద్లో మొత్తం 208 మంది మంది పాకిస్తానీయులు ఉన్నట్లు  సమాచారం. వీరందరిని రెండు రోజుల్లో వెళ్లిపోవాలని పోలీసులు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.