T20 World Cup 2024: సూపర్-8 అవకాశాలు సంక్లిష్టం.. డేంజర్ జోన్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్

T20 World Cup 2024: సూపర్-8 అవకాశాలు సంక్లిష్టం.. డేంజర్ జోన్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్

ప్రపంచ క్రికెట్ లో అగ్రశ్రేణి జట్లలో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు ఉంటాయి. టీ20 వరల్డ్ కప్ అనగానే ఫేవరేట్ జట్లలో ఈ రెండు జట్లు కూడా ఉన్నాయి. 2022 వరల్డ్ కప్ లో రన్నరప్ గా నిలిచిన పాకిస్థాన్..  ఐసీసీ టోర్నీ అంటే నాకౌట్ దశకు చేరుకునే కివీస్ సూపర్ 8 దశకు అర్హత సాధించడం నల్లేరు మీద నడక అనుకున్నారు. అయితే వారంలో ఇదంతా రివర్స్ అయింది. పసికూన జట్లపై విజయాలు సాధించలేక తొలి రౌండ్ ను దాటలేక నానా కష్టాలు పడుతున్నాయి. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ అమెరికా మీద ఓడిపోతే.. నేడు (జూన్ 8) జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ కు భారీ షాక్ ఇచ్చింది.

భారత్ పై గెలిచి తీరాల్సిందే:

తొలి మ్యాచ్ అమెరికా తో ఓడిపోవడంతో పాకిస్థాన్ అన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించాల్సిన పరిస్థితి. ఒకవేళ భారత్ పై ఓడిపోతే మాత్రం మిగిలిన రెండు మ్యాచ్ ల్లో గెలవడంతో పాటు ఇతర మ్యాచ్ ల ఫలితాలపై ఆధారపడాలి. ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచిన అమెరికా.. ఐర్లాండ్ లేదా భారత్ లపై ఒక మ్యాచ్ గెలిచినా పాక్ సర్దుకోవాల్సిందే. దీంతో పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తుంది. భారత్ పై గెలవడం అంత సులువు కాదు. కెనాడను మినహాయిస్తే ఐర్లాండ్ గట్టి పోటీ ఇస్తుందనడంలో అనుమానం లేదు. మరి పాక్ విజయాలతో పాటు అదృష్టం కూడా వరిస్తుందేమో చూడాలి. 

కివీస్ భారీ తేడాతో గెలిస్తేనే:

ఆఫ్ఘనిస్తాన్ పై ఓడిపోవడం న్యూజిలాండ్ కు పెద్ద మైనస్ గా మారింది. పైగా భారీ తేడాతో ఓడిపోవడం ఆ జట్టును కోలుకోనీయకుండా చేస్తుంది. సూపర్ 8 లో మిగిలిన మూడు మ్యాచ్ ల్లో గెలిస్తేనే కివీస్ అవకాశాలు ఉంటాయి. రెండు గెలిచినా రన్ రేట్ తో టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది. ఉగాండా, పపువా న్యూ గినియా లపై విజయాలు సాధించినా ఇదే గ్రూపు లో వెస్టిండీస్ మీద విజయం సాధించడం కీలకం. మరో మ్యాచ్ గెలిచినా ఆఫ్ఘనిస్తాన్ భారీ రన్ రేట్ ఉండడంతో సూపర్ 8 కు అర్హత సాధించే అవకాశం ఉంది. ఎలా చూసుకున్నా.. వెస్టిండీస్, న్యూజీలాండ్ జట్లలో ఒక జట్టు ఇంటి దారి పట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది.