ఇరాన్‌‌‌‌పై పాక్ ప్రతీకార దాడి

ఇస్లామాబాద్: బలూచిస్తాన్ ప్రావిన్స్‌‌‌‌లో ఇరాన్ జరిపిన మిసైల్ దాడులకు పాకిస్తాన్ ప్రతీకార దాడి చేసింది. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన 24 గంటల్లోనే.. ఇరాన్‌‌‌‌కు చెందిన సియస్తాన్ – బలూచిస్తాన్‌‌‌‌ ప్రావిన్స్‌‌‌‌లోని టెర్రరిస్టు స్థావరాలపై మిలిటరీ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడుల్లో 9 మందికి పైగా చనిపోయారు. 80 కిలోమీటర్ల పరిధిలోని ఏడు లొకేషన్లపై పాకిస్తాన్ ఎయిర్‌‌‌‌‌‌‌‌స్పేస్‌‌‌‌ నుంచే ఈ దాడులు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ పౌరులను కానీ, మిలిటరీ సిబ్బందిని కానీ టార్గెట్ చేయలేదని చెప్పాయి. మరోవైపు తమపై దాడి చేసిన పాక్‌‌‌‌పై తాము యుద్ధం ప్రకటిస్తున్నామని, ఆ దేశం మూల్యం చెల్లించుకోక తప్పదని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరికలు చేసింది. 

కిల్లర్ డ్రోన్లు, రాకెట్లతో..

‘‘ఈ రోజు ఉదయం ఇరాన్‌‌‌‌లోని సియస్తాన్ – - బలూచిస్తాన్ ప్రావిన్స్‌‌‌‌లోని ఉగ్రవాద స్థావరాలపై అత్యంత సమన్వయంతో, ప్రత్యేకంగా టార్గెట్ చేసి కచ్చితమైన సైనిక దాడులను చేపట్టాం’’ అని పాక్ విదేశాంగ శాఖ ఆఫీసు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘మార్గ్ బార్ సర్మాచార్ (గెరిల్లాకు మరణం)’ కోడ్ నేమ్‌‌‌‌తో నిర్వహించిన ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్‌‌‌‌లో పలువురు టెర్రరిస్టులు చనిపోయారని చెప్పింది. ‘‘బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌‌‌‌ఏ), బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) టెర్రరిస్టు ఆర్గనైజేషన్ల స్థావరాలపై కిల్లర్ డ్రోన్లు, రాకెట్లు, మందుగుండు సామగ్రి, స్టాండ్ - ఆఫ్ ఆయుధాలతో దాడులు చేశాం. కొలేటరల్ డ్యామేజ్ జరగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాం. ఈ స్థావరాల్లో కరుడుగట్టిన టెర్రరిస్టులు దోస్తా అలియాస్ చైర్మన్, బజ్జర్ అలియాస్ సోఘట్, సహైల్ అలియాస్ షఫాఖ్, అస్ఘర్ అలియాస్ బాషమ్, వాజిర్ అలియాస్ వాజి తదితరులు ఉన్నారు’’ అని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌‌‌‌పీఆర్) వివరించింది.

మా ఆందోళనలను ఇరాన్ పట్టించుకోలే.. 

‘‘ఇరాన్‌‌‌‌లో తమను తాము సర్మాచార్లుగా పిలుచుకునే ఉగ్రవాదుల విషయంలో మేం నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. కానీ మా ఆందోళనలను ఇరాన్ పట్టించుకోలేదు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో టెర్రరిస్టులు అమాయక పాకిస్తానీలను చంపుతున్నారు. సర్మాచార్లు భారీ-స్థాయి తీవ్రవాద కార్యకలాపాలు జరుపుతున్నట్లుగా వచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగానే ఈ చర్య (దాడి)లు తీసుకున్నాం’’ అని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. కాగా, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు కోసం దావోస్ పర్యటనకు వచ్చిన పాక్ కేర్ టేకర్ ప్రధాని అన్వరుల్ హాక్ కకర్.. మిలిటరీ అటాక్స్ నేపథ్యంలో తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్నారు. 

దాడులను ఖండించిన ఇరాన్

పాకిస్తాన్ దాడిని ఇరాన్ ఫారిన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ నాజిర్ కనాని తీవ్రంగా ఖండించారు. నిరసనగా పాకిస్తాన్ రాయబారికి సమన్లు జారీ చేశారు. పాక్ దాడిపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. నలుగురు పిల్లలు సహా మొత్తం తొమ్మిది మంది నాన్ ఇరానియన్లు చనిపోయారని మంత్రి అహ్మద్ వాహిదీ తెలిపారు. 

ఇండియా, అమెరికా, చైనా ఏమన్నాయంటే..

ఇరాన్, పాక్ మధ్య దాడుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు స్పందించాయి. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి రణ్‌‌‌‌ధీర్‌‌‌‌ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘‘ఇది పూర్తిగా ఇరాన్‌‌‌‌, పాక్ అంతర్గత వ్యవహారం. ఆత్మరక్షణలో భాగంగా కొన్ని దేశాలు తీసుకునే చర్యలను అర్థం చేసుకోగలం” అని తెలిపారు. మూడు దేశాల సార్వభౌమ సరిహద్దులను 48 గంటల్లో ఇరాన్ ఉల్లంఘించిందని అమెరికా విదేశాంగ శాఖ విమర్శించింది. ఇక చైనా న్యూట్రల్‌‌‌‌గా వ్యవహరించింది. ఉద్రిక్తతను పెంచే చర్యలను నివారించాలని రెండు దేశాలకు పిలుపునిచ్చింది.