సింధు నదిపై మాకు సమాన హక్కులు.. నీటి కోసం దేనికైనా రెడీ: పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

సింధు నదిపై మాకు సమాన హక్కులు.. నీటి కోసం దేనికైనా రెడీ: పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

ఇస్లామాబాద్: జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాం ఉగ్రదాడి ఘటనపై పాక్ ప్రధాని షబాజ్ షరీఫ్ ఎట్టకేలకు నోరు విప్పారు. శనివారం (ఏప్రిల్ 26) కాకుల్‌లోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాక్-భారత్ మధ్య ఉద్రిక్తతలకు దారితీసిన పహల్గాం టెర్రర్ ఎటాక్‎పై షబాజ్ షరీఫ్ సైలెన్స్ వీడారు. 

ఒక బాధ్యతాయుతమైన దేశంగా పహల్గామ్ ఉగ్రదాడిపై జరిగే ఏదైనా తటస్థ, పారదర్శక దర్యాప్తులో పాల్గొనడానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉందని నొక్కి చెప్పారు. ఇరు దేశాల మధ్య శాంతే మా తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత్ ఏదైనా దాడులకు పాల్పడితే వాటిని ధీటుగా ఎదుర్కొని.. ప్రతిదాడులు చేసేందుకు కూడా సిద్ధమని తేల్చి చెప్పారు.

ఇక.. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా పాక్‎తో సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడంపైన ఆయన ఘాటుగా స్పందించారు. సింధు నదిపై మాకు సమాన హక్కులు ఉన్నాయి. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడానికే పహల్గామ్ ఉగ్రదాడిని భారత్ ఒక సాకుగా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. పహల్గాం ఉగ్రదాడి వెనక పాక్ ప్రమేయం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు, దర్యాప్తు లేకుండానే భారత్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. 

సింధు నది జలాల విషయంలో అన్యాయం జరిగితే పూర్తి శక్తితో ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. మా దేశ సమగ్రత, భద్రత విషయంలో మేము ఎప్పుడూ రాజీపడం. భారత్ ఎలాంటి దుశ్చర్యకు పాల్పడిన దానికి తగ్గరీతిలో బదులిచ్చేందుకు మేం సర్వం సిద్ధం. పాక్ సాయుధ దళాలు దేశాన్ని, దాని సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడటానికి పూర్తి సామర్థ్యంతో సిద్ధంగా ఉన్నాయి. 2019 ఫిబ్రవరిలో భారత్ చేసిన దాడికి మేం ప్రతిస్పందించిన తీరు గుర్తుంచుకోవాలి అని షరీఫ్ హాట్ కామెంట్స్ చేశారు.