తటస్థ విచారణకు సిద్ధం: మౌనం వీడిన పాక్ ప్రధాని

తటస్థ  విచారణకు సిద్ధం: మౌనం వీడిన పాక్ ప్రధాని
  • మా దేశ సార్వభౌమత్వం రాజీ పడబోం
  •  మౌనం వీడిన పాకిస్తాన్  ప్రధానమంత్రి
  • శాంతి వచనాలు వల్లెవేసిన షెహబాజ్ షరీఫ్​ 
  • ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామని స్పష్టం

ఢిల్లీ: పెహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్​నోరు విప్పారు.  శాంతి వచనాలు వల్లెవేశారు. తటస్థ విచారణకు సిద్ధమని ప్రకటించారు. పాకిస్తాన్ పై భారత్ తీసుకున్న నిర్ణయాలపై అక్కసు వెల్లగక్కారు. అదే సమయంలో ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామని ప్రకటించారు.  ఇవాళ పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్‌ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా  షెహబాజ్‌ షరీఫ్‌ మాట్లాడుతూ..  ‘పహల్గాంలో ఇటీవల జరిగిన విషాదకర ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఆ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. శాంతికే మా ప్రాధాన్యం’ అన్నారు. ‘మా దేశ భద్రత, సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీపడబోం. ఎలాంటి ముప్పును ఎదుర్కోడానికైనా సంసిద్ధంగా ఉన్నాం’ అని చెప్పారు.  

సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశాన్ని ప్రస్తావించారు. ఇండియా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదని అన్నారు.  ఈ చర్యతో దాయాది దేశం యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోందని చెప్పారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని తాము  కోరుకుంటున్నామంటూ భారత్‌ను నిందించే ప్రయత్నం చేశారు.