పాల పండ్లు.. వీటి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ అటవీ, గిరిజన ప్రాంతాల్లో నివసించే వారికి వీటిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాలలో అత్యధికంగా కనిపించే ఈ చెట్లు.. ఇటీవలి కాలంలో చెట్ల సంఖ్యం బాగా తగ్గిపోవడంతో వీటికి డిమాండ్ పెరిగిపోయింది. ఈ చిన్న పండ్లను ఇప్పుడు కిలో రూ.500 వరకు విక్రయిస్తున్నారు.
ఈ పసుపు పండ్లు ఆకురాల్చే అడవులలో వేసవిలో మాత్రమే దొరికే అరుదైన, సహజమైన సీజన్ పండ్లు. గ్రామీణ ప్రజలు, అటవీ సరిహద్దు గ్రామాల నివాసితులు, గొర్రెల కాపరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, మండే వేడి పరిస్థితులను ఎదుర్కొని... ఈ పండ్లను సేకరిస్తూ ఉంటారు. ప్రస్తుతం చెట్ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నందున కేవలం రెండు లేదా మూడు కిలోల పండ్లను సేకరించేందుకే వారు చాలా గంటలు వెచ్చిస్తున్నారు.
అలా సేకరించిన లేత పండ్లను పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై విక్రయిస్తారు. చెన్నూరు మండలం కిష్టంపేట్ గ్రామానికి చెందిన గిరిజనురాలు మరక్క డి మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి మే వరకు ఈ పండ్లను సేకరించడం ద్వారా జీవనోపాధి పొందగలుగుతున్నామన్నారు. అయితే చెట్లు తగ్గుముఖం పట్టడంతో ఆదాయం కూడా తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది.
శారీరక శ్రమ, ప్రాణహాని, పండ్లను సేకరించే సమయం కారణంగా పండ్లను కిలో రూ.400 నుంచి రూ.500 వరకు పలుకుతున్నట్లు రోడ్డు పక్కన వ్యాపారులు చెబుతున్నారు. ఈ సీజనల్ పండ్లను సేకరించే సమయంలో వన్యప్రాణుల దాడులకు గురయ్యే అవకాశం ఉందని, వడదెబ్బ తగిలి అనారోగ్యం పాలవుతున్నారని అందుకే ఈ రేటుకు అమ్మాల్సి వస్తుందని వారు చెబుతున్నారు.
కొన్నేళ్ల క్రితం వరకు ఈ పండ్లు కిలోకు రూ. 100 చొప్పున పండ్లను కొనుగోలు చేసేవారని అటవీ ఉత్పత్తుల ప్రేమికులు గుర్తు చేసుకుంటున్నారు. ధర పెరిగినప్పటికీ, రుచి, పోషకాలు, ఖనిజాలు, ఆరోగ్య ప్రయోజనాలను పుష్కలంగా ఉన్నందున ఈ పండ్లను తీసుకునేవారు మాత్రం చాలా మంది ఉన్నారు.
ఈ పండ్లలో కాల్షియం, ఐరన్, ప్రొటీన్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫాస్పరస్‌లు ఉన్నాయని కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ బోటనీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఇ నరసింహమూర్తి తెలిపారు. ఈ పండ్లను తీసుకోవడం వల్ల అనోరెక్సియా, బ్రాంకైటిస్, కోలిక్ వంటివి నయమవుతాయి. ఈ పండు ఆకలి పుట్టించే సహజ ఆయుర్వేదిక ఔషధంగానూ పనిచేస్తుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని, ఈ మొక్క సపోటేసి కుటుంబానికి చెందినదని ఆయన తెలియజేశారు.