పోటాపోటీగా కాంగ్రెస్‌‌‌‌, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ధర్నా

పోటాపోటీగా కాంగ్రెస్‌‌‌‌, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ధర్నా

అక్రమ కేసులు పెడుతున్నారని కాంగ్రెస్‌‌‌‌, అఖిలపక్షాల ర్యాలీ

మంత్రిపై పోస్టులను నిరసిస్తూ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఆందోళన

పాలకుర్తి, వెలుగు: కావాలనే కేసులు పెడుతున్నారని కాంగ్రెస్‌‌‌‌, అఖిలపక్ష లీడర్లు, మంత్రిపై పోస్టులకు వ్యతిరేకంగా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు గురువారం పోటాపోటీగా ఆందోళన, ధర్నాకు దిగడంతో జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రం ఉద్రిక్తంగా మారింది. జనగామ డీసీపీ సీతారాం ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావుపై సోషల్‌‌‌‌ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారంటూ ఈ నెల 24న సీపీఐఎంఎల్‌‌‌‌ నాయకుడు మామిండ్ల రమేశ్‌‌‌‌ రాజా, 25న కాంగ్రెస్‌‌‌‌ పార్టీ సోషల్‌‌‌‌ మీడియా ఇన్‌‌‌‌చార్జి కొండా శ్రీనుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిని నిరసిస్తూ కాంగ్రెస్‌‌‌‌, అఖిలపక్ష లీడర్ల ఆధ్వర్యంలో గురువారం ధర్నాకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌ఐ ఝాన్సిరెడ్డి ఆధ్వర్యంలో లీడర్లు ర్యాలీగా రాజీవ్‌‌‌‌ చౌరస్తాకు బయలుదేరారు. అయితే మంత్రిపై అనుచిత పోస్టులు పెడుతున్నారంటూ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు సైతం రాజీవ్‌‌‌‌ చౌరస్తాలోనే ఆందోళనకు దిగారు. దీంతో 
కాంగ్రెస్‌‌‌‌ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్‌‌‌‌ లీడర్లు రోడ్డుపైనే బైఠాయించారు. తర్వాత పోలీసులను తోసుకుంటూ వెళ్లిన ఝాన్సిరెడ్డి రాజీవ్‌‌‌‌ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అక్కడే కూర్చొని నిరసన తెలిపారు. ఓ వైపు కాంగ్రెస్‌‌‌‌, మరో వైపు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు పోటాపోటీగా నినాదాలు చేశారు. సుమారు రెండు గంటల పాటు ఆందోళన కొనసాగగా పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.

మంత్రి అండతోనే అక్రమ కేసులు

అభివృద్ధిపై మంత్రి ఎర్రబెల్లిని ప్రశ్నిస్తున్నందుకే పోలీసులు తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని కాంగ్రెస్‌‌‌‌ నాయకురాలు ఝాన్సీరెడ్డి ఆరోపించారు. గురువారం పాలకుర్తిలో మీడియాతో మాట్లాడారు. మంత్రి దయాకర్‌‌‌‌రావుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే తమ కార్యకర్తలపై కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హమీ ఇచ్చారు. సమావేశంలో మండల అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, రాపాక సత్యనారాయణ, పెద్ది కృష్ణమూర్తి గౌడ్‌‌‌‌, అఖిలపక్ష లీడర్లు మామిండ్ల రమేశ్‌‌‌‌ రాజా, సోమ సత్యం, చిట్యాల సోమన్న, మాచర్ల సారయ్య పాల్గొన్నారు.