- ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి
తొర్రూరు, వెలుగు: తొర్రూరు మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. తొర్రూరులో 15వ ఆర్థిక సంఘం నిధులతో కొనుగోలు చేసిన రెండు ట్రాక్టర్లు, డోజర్తోపాటు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ శుక్రవారం ఆమె ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి పట్టణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు.
మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంగళంపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ జినుగు సురేందర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు దొంగరి రేవతి, గజానంద్, తునం రోజా, బిజ్జలా మాధవి, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
కాగా, మున్సిపాలిటీలో కొత్త ట్రాక్టర్లు, డోజర్ల ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులను మున్సిపల్ కమిషనర్, చైర్మన్ ఆహ్వానించకుండా అవమానించారని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎన్నమనేని శ్రీనివాసరావు వాపోయారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి నిరసన చేశారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు.