చిత్తూరు : ఎర్రచందనం అక్రమ రవాణాలో జబర్దస్త్ ఆర్టిస్ట్ హరి ప్రధాన సూత్రధారి అని పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి వెల్లడించారు. శేషాచలం అటవీ ప్రాంతంలో మాత్రమే లభ్యమయ్యే ఎర్రచందనం దుంగలను విదేశాలకు అక్రమంగా తరలించి.. కొందరు కోట్లు గడిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీసులు ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతున్నా స్మగ్లర్స్ మాత్రం విచ్చలవిడిగా స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా ఎర్రచందనం అక్రమ రవాణాలో జబర్దస్త్ కామెడియన్ హరి హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కమెడియన్ హరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఆదివారం (జూన్ 11న) రాత్రి పుంగనూరు శివారు ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులను చూసి రెండు వాహనాలు తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. వాటిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓ వాహనం డ్రైవర్ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. మరో వాహనం డ్రైవర్ కిశోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాలను తనిఖీ చేయగా దాదాపు రూ.60 లక్షల విలువ చేసే 19 ఏ గ్రేడ్ ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకుని, రెండు వాహనాలను సీజ్ చేశారు.
పోలీసుల అదుపులో ఉన్న కిశోర్ ను విచారించగా పలు కీలక విషయాలు వెల్లడించాడు. ఎర్రచందనం దుంగలను అక్రమంగా భాకరాపేట అటవీ ప్రాంతంలో సేకరించి.. అక్కడి నుండి కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సమీపంలోని కటిగనహళ్ళి గ్రామానికి తరలిస్తున్నట్లు కిశోర్ వెల్లడించాడని పోలీసులు తెలిపారు.
ఎర్రచందనం అక్రమ రవాణాలో జబర్దస్త్ ఆర్టిస్ట్ హరి ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పరారీలో ఉన్న ఎర్రచందనం స్మగ్లర్, ప్రధాన సూత్రధారి జబర్దస్త్ కమెడియన్ హరి కోసం పోలీసులు అన్ని చోట్ల గాలింపు చర్యలు చేపట్టారు.
ఇప్పటికే హరి టాస్క్ ఫోర్స్ పోలీసుల వద్ద రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని చెబుతున్నారు. కాణిపాకం పోలీస్ స్టేషను పరిధిలో ఒక కేసు, ఏర్పేడు పోలీస్ స్టేషను పరిధిలో ఒక కేసులో హరి నిందితుడిగా ఉన్నట్లు పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి వెల్లడించారు.