రాష్ట్రంలోనే మహబూబ్ నగర్ జిల్లా వ్యవసాయ సాగు యోగ్యమైన భూములు కలిగిన అతిపెద్ద జిల్లా. 45.50 లక్షల హెక్టార్ల భౌగోళిక విస్తీర్ణం కలిగిన జిల్లాగా గుర్తింపు పొందింది. ఈ జిల్లా ప్రాంత రైతులు ఎక్కువగా వర్షాధార పంటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పూర్తిగా 100శాతం కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నది. అదేవిధంగా 18.80 లక్షల హెక్టార్ల భౌగోళిక విస్తీర్ణం కలిగిన రంగారెడ్డి,14.60 లక్షల హెక్టార్ల విస్తీర్ణంతో నల్లగొండ జిల్లాలు 100 శాతం కృష్ణ బేసిన్ లో ఉన్నవి. మహబూబ్‌నగర్ జిల్లాలో 240 కిలోమీటర్ల పొడవున కృష్ణానది ప్రవహిస్తున్నప్ప
టికీ.. కోరలు చాచిన కరువు రక్కసితో జిల్లా ప్రజలు వలస బాట పడుతున్నారు. ఎత్తిపోతల పేరిట గత పాలకుల హైడ్రామాలతో జిల్లాలోని రైతాంగం పరిస్థితి దుర్భరంగా తయారయింది. అనేక ఉద్యమాలు ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆ నాటి ప్రభుత్వం శాశ్వత కరువు నివారణలో భాగంగా పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. 2013లో మహబూబ్ నగర్ జిల్లాలోని 7 లక్షల ఎకరాలకు, నల్లగొండ-, రంగారెడ్డి జిల్లాల్లో 3 లక్షల ఎకరాలకు సాగునీరుతోపాటు, తాగునీరు అందించేందుకు పూనుకున్నారు. ప్రతిరోజు 2 టీఎంసీల చొప్పున జూరాల ప్రాజెక్టుకు వచ్చే వరద జలాల నుంచి 35 రోజులలో 70 టీఎంసీలు ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పన చేశారు. ఈ పథకానికి సుమారు రూ.9 వేల కోట్లు కేటాయిస్తూ పరిపాలన అనుమతి ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలోని 38 మండలాలతో పాటు రంగారెడ్డి జిల్లాలోని 13 మండలాలు, నల్లగొండ జిల్లాలోని 2 మండలాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేవిధంగా రూపొందించారు. ఈ పథకంలో అన్ని లిఫ్టులు పనిచేయడానికి 2,350 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని అంచనావేసి ఉమ్మడి రాష్ట్రంలో చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
కరవు జిల్లాలపై బీఆర్ఎస్ వివక్ష
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం కేసీఆర్ ఈ పథకాన్ని రీడిజైన్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 12.30 లక్షలు ఎకరాలకు సాగునీటితో పాటు, తాగునీటి అందించేవిధంగా మార్చారు. అందుకు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 90 టీఎంసీల మిగులు జలాలను రోజుకు 2 టీఎంసీల చొప్పున 45 రోజులలో వాడుకునే విధంగా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.35,200 కోట్ల అంచనాతో జీ వో విడుదల చేశారు. 2015లో అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణానది నుంచి నార్లాపూర్ కు, నార్లాపూర్ నుంచి ఎదులకు, ఏదుల నుంచి వట్టెంకు, వట్టెం నుంచి కరివేనకు, కర్వేను నుంచి ఉదండాపూర్ కు, ఉద్దండపూర్ నుంచి లక్ష్మీదేవి పల్లికి నీరు ఎత్తిపోయాలి. లక్ష్మీదేవి పల్లె రిజర్వాయర్ ఎత్తు 670 మీటర్లు. ఈ అన్ని ప్రాజెక్టుల్లో 31 పంపులు ఉంటాయి. 28 పంపులు145 మెగావాట్లవి. 3 పంపులు 65 మెగావాట్లవి. నార్లాపూర్ వద్ద కేవలం ఒకే ఒక్క మోటారును ఏర్పాటుచేసి అసెంబ్లీ ఎన్నికలు త్వరలో వస్తున్న వేళ 2023 సెప్టెంబర్ 13న హడావిడిగా ప్రారంభించారు. అయితే, 2015 లో శంకుస్థాపన చేసిన సందర్భంలో కేసీఆర్ మాట్లాడుతూ..2018లోగా పూర్తి చేసి పాలమూరు రైతుల కాళ్లను కడుగుతానని చెప్పారు. కానీ, ఈ స్కీమ్ పూర్తి చేయుటకు నిధులు ఇవ్వకుండా కరువుకు గురవుతున్న జిల్లాలపై తీవ్ర వివక్ష చూపించారని దక్షిణ తెలంగాణ ప్రాంత రైతులు ప్రజలు వాపోతున్నారు.
ప్రాజెక్టు పూర్తికి కదలిక వచ్చేనా
కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాలపై ఆధారపడి చేపట్టిన పాలమూరు–- రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించింది. దానికి కావాలసిన అనుమతులు, జాతీయ హోదా ఇచ్చి ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్‌ని కలిశారు. జాతీయ హోదా ఇవ్వలేమని, ఆ ప్రాజెక్టుకు మరోరకంగా ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిన నిధులు ఇచ్చేందుకు కృషి చేస్తామని షెకావత్ తెలపడంతో రైతుల్లో ఆశలు రేకెత్తాయి. రూ.55,086 కోట్ల వ్యయం అంచనాతో చేపట్టిన ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్ర జల సంఘం పరిశీలనకు పంపించడం జరిగింది. ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ, వైల్డ్ లైఫ్ వంటి అనుమతులు వచ్చాయి. హైడ్రాలజీ, ఇరిగేషన్, ప్లానింగ్, కాస్ట్ ఎస్టిమేట్, అంతర్ రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన అనుమతులు రావాల్సి ఉంది. ఈ అనుమతులు సాధ్యమైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వం ఇప్పించాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంత ప్రజలు, రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి.
కొలిక్కిరాని భూ సేకరణ
నార్లాపూర్, ఉద్దండపూర్ రిజర్వాయర్ల కింద దాదాపు 650 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ భూములకు సంబంధించిన దాదాపు 120 మంది రైతులు మల్లన్న సాగర్ తరహాలో పరిహారం ఇవ్వాలని,2013 భూ సేకరణ చట్టం ప్రకారం కుటుంబానికి ప్రత్యేక ప్యాకేజీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. నార్లాపూర్ కింద అంజనగిరి, వడ్డే గుడిసెలు, సున్నపు తండాల్లో 110 కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించారు. వీరికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింప చేయలేదు. ఉద్దండపూర్ కింద వల్లూరు, ఉద్దండపూర్, రేగడి ఒట్టి తండా, తుమ్మల బండ తండా, సాదు గుడిసెల తండాల్లో 3000 మందికి పైగానే నిర్వాసితులను గుర్తించారు. పునరావాసం కోసం భూసేకరణ చేసినా ఇళ్లను కట్టి ఇవ్వలేదు. ఏదుల రిజర్వాయర్ కింద కొంకలోనిపల్లె, బండ రావిపాకుల ముంపునకు గురవుతుండగా, 1558 కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించారు. ఆరు రిజర్వాయర్లకుగాను ఆరో రిజర్వాయర్ లక్ష్మీదేవి పల్లె రిజర్వాయర్ పనులను పక్కకు పెట్టారు. 4 రిజర్వాయర్ల పనులు 70 శాతం పూర్తికాగా, ఉద్దండపూర్ 30 శాతం మాత్రమే పూర్తయింది. హెడ్ వర్క్స్ పనులు, డిస్ట్రిబ్యూటర్స్ కెనాల్స్ పూర్తి కాలేదు.
- ఉజ్జిని రత్నాకర్ రావు సీపీఐ నేత