నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలో సీపీఎం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్లక్ష్యానికి గురవుతోందని, ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.45 వేల కోట్లతో ప్రారంభించిన ఈ పథకానికి నిధులు కేటాయించకపోవడంతో వర్క్స్ స్పీడ్‌గా జరగడం లేదన్నారు.
వట్టెం రిజర్వాయర్ పనులు 50 శాతం కూడా పూర్తి కాలేదని విమర్శించారు. పంప్ హౌస్ లు నిర్మించడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. జిల్లాలో అచ్చంపేట, కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్న పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిబంధనల పేరుతో చాలా మందిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కార్యదర్శి పర్వతాలు, ఆర్ శ్రీనివాస్, ఆంజనేయులు పాల్గొన్నారు.