మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : పరిశ్రమల ఏర్పాటుకు వివిధ శాఖల నుంచి పర్మిషన్లు గడువులోగా మంజూరు చేయాలని పాలమూరు కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ టీజీ ఐ పాస్ ద్వారా ఇవ్వాల్సిన అనుమతులు ఆలస్యం కాకుండా చూడాలన్నారు. టి ఫ్రైడ్ ద్వారా 9 మంది ఎస్సీలకు ట్రాక్టర్ అండ్ ట్రాలీ
8 మంది ఎస్టీలకు ట్రాక్టర్, టాటా ఏస్, మారుతి డిజైర్ వెహికల్స్‌తో పాటు, ఒకరికి పావలా వడ్డీ రుణం మంజూరు చేసేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ పి.ప్రతాప్, ఎల్డీఎం భాస్కర్, భూగర్బ జల వనరుల శాఖ డీడీ రమాదేవి, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ సురేశ్, ఎంవీఐ రఘు పాల్గొన్నారు.
సర్వే డేటా ఎంట్రీ పక్కాగా ఉండాలి..
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాల డేటాను జాగ్రత్తగా ఎంట్రీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు సర్వే చేసి సేకరించిన వివరాలను అత్యంత గోప్యంగా ఉంచాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
హన్వాడ/గండీడ్ : రైతులకు ఇబ్బంది లేకుండా వడ్లు కొనుగోలు చేయాలని కలెక్టర్ విజయేందిరబోయి సూచించారు. బుధవారం హన్వాడ, మహమ్మదాబాద్, మహ్మదాబాద్ మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామాల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.
కొనుగోలు చేసిన వడ్లు, రైతుల వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేసి 48 గంటల్లో డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహమ్మదాబాద్ మండల కేంద్రంలో ఇంటింటి సర్వేను పరిశీలించారు.