పాలమూరు రైతుల అభిప్రాయమిదీ
రైతు భరోసాపై రైతుల్లో భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. పలువురు 5–7 ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని కోరుతుండగా.. మెజార్టీ అన్నదాతలు మాత్రం పదెకరాలలోపు వరకు ఇవ్వాలని సూచిస్తున్నారు. కౌలు రైతులకూ ఇవ్వాలని కొందరు అడుగుతుంటే.. కౌలు రైతులకు వద్దని, ఇస్తే గొడవలు జరుగుతాయని మరికొందరు చెబుతున్నారు. ఉమ్మడి పాలమూరు రైతులు ఈ మేరకు వారి అభిప్రాయాలను కేబినెట్ సబ్ కమిటీ ముందు పెట్టారు.
వనపర్తి, వెలుగు: వనపర్తి కలెక్టరేట్లో రైతు భరోసా అభిప్రాయ సేకరణపై కేబినెట్ సబ్‌కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వర్క్‌షాప్ నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్లానింగ్ బోర్డు చైర్మన్ చిన్నారెడ్డి, ఎంపీ మల్లురవి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంపిక చేసిన 250 మంది రైతుల నుంచి సూచనలు, అభిప్రాయాలు తీసుకున్నారు. మిగిలిన రైతులు అభిప్రాయాలు తెలుసుకునేలా కలెక్టరేట్ఆవరణలో ఎల్ఈడీ స్ర్కీన్‌ను ఏర్పాటు చేశారు.
గ్రామ సభ అభిప్రాయాన్ని తీసుకోవాలి
రైతు బంధు విషయంలో గతంలో చాలా తప్పులు జరిగాయి. ఈ ప్రభుత్వం అలా చేయకుండా గ్రామాల్లోనూ గ్రామసభలు నిర్వహించి రైతులు, కౌలు రైతులకు రైతు భరోసా అందేలా సూచనలు తీసుకోవాలి. 2011లో ఉమ్మడి పాలమూరులో 56 వేల మంది కౌలు రైతులున్నారని గుర్తించారు. 12 వేల మందికి గుర్తింపు కార్డులు కూడా ఇచ్చారు. గుర్తింపు కార్డులున్న వారికి రైతు భరోసా ఇవ్వాలి.
జబ్బార్, రైతు సంఘం నాయకుడు, వనపర్తి
కౌలు రైతుకు ఇవ్వాలి
నాకు ఎకరా పొలం ఉంది. కొంత కౌలు తీసుకుని సాగు చేస్తున్న. రైతు భరోసాను కౌలు రైతులకూ అమలు చేయాలి. కౌలు రైతుల కష్టాలను గుర్తించి వారిని ఇతరత్రా పథకాలను అమలు చేస్తూ ఆదుకోవాలి.
సీతారాములుగౌడ్, గద్వాల
కరెంటు, సాగు నీరు సక్రమంగా ఇవ్వాలి
రైతును రాజును చేస్తామంటున్రు బాగానే ఉంది. రైతు భరోసాను పదెకరాలలోపున్న వారికి అమలు చేస్తూ కరెంటు నిరంతరాయంగా ఇవ్వాలి. వ్యవసాయానికి సాగునీరు సక్రమంగా అందించేలా చూస్తే అదే పదివేలు. - నాగన్న, వనపర్తి
ఏడెకరాల వరకే ఇవ్వాలి
రైతులకు ఏడెకరాలకు వరకు రైతు భరోసా ఇవ్వాలి. అదేవిధంగా గత ప్రభుత్వం నిలిపేసిన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీలు అందజేయాలి.
నాగిరెడ్డి, కిసాన్‌సెల్ ప్రతినిధి, మహబూబ్‌నగర్
కౌలు రైతులకు వద్దు
కౌలు రైతులకు రైతు భరోసా అమలు చేయొద్దు. వారు మూడు సార్లు కౌలు చేస్తే పొలంలో టెనంట్ యాక్టు కింద వారికి వాటా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో గొడవలు జరుగుతాయి. పది ఎకరాల లోపల ఉన్న రైతులకే రైతు భరోసా ఇవ్వాలి.
శకుంతల, అడ్డాకుల, మహబూబ్‌నగర్