ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే ఉద్యోగులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.  ప్రతి ఆదివారం చేపట్టే శ్రమదానంలో భాగంగా ప్రభుత్వ జనరల్  ఆసుపత్రి పరిసరాలను శుభ్రం చేశారు. ఆసుపత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో డాక్టర్లపై అసహనం వ్యక్తం చేశారు. డ్రైనేజీ, పైప్ లైన్, ఇతర అభివృద్ధి పనులకు ముడా, మున్సిపాలిటీ  నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

 అనంతరం పట్టణంలోని ఏనుగొండ కాలనీలో రూ.191.90 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో జిల్లా ఆసుపత్రిపై శ్రద్ధ చూపించి ఉంటే ప్రస్తుతం ఈ సమస్యలు ఉండేవి కావన్నారు. శానిటేషన్, డ్రైనేజీ రిపేర్లు, నిరుపయోగంగా ఉన్న పాత సామాను తొలగించాలని ఆదేశించారు. ఆరు నెలల్లో సౌలతులు మెరుగుపరిచి ఆసుపత్రిలో నాణ్యమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రతి నెలా 1, 15 తేదీల్లో ఆసుపత్రిలో క్లీన్  డ్రైవ్  కార్యక్రమాన్ని చేపడతారని, ఈ కార్యక్రమాన్ని మున్సిపల్, ముడా చైర్మన్  పర్యవేక్షిస్తారని చెప్పారు. మున్సిపల్  చైర్మన్  ఆనంద్ గౌడ్, ముడా చైర్మన్  లక్ష్మణ్  యాదవ్, మున్సిపల్  వైస్  చైర్మన్  షబ్బీర్ అహ్మద్, హాస్పిటల్  సూపరింటెండెంట్  సంపత్ కుమార్ సింగ్, మున్సిపల్  కమిషనర్  మహేశ్వర్ రెడ్డి,  సీహెచ్ వో రాము నాయక్, బెజ్జుగం రాఘవేంధర్, రాములు యాదవ్,  ఫయాజ్, మోయిస్, రఘు పాల్గొన్నారు.