పాలమూరు/మహబూబ్‌నగర్‌రూరల్, వెలుగు: సర్కారు భూమిలో ఇంచు కబ్జా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. మహబూబ్‌నగర్ ఎంపీడీవో ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన మండల సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. సర్కారు భూములను కాపాడే బాధ్యత పాలకులు, అధికారులేదనన్నారు.
సర్కారు బడుల్లో టాయిలెట్స్, తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా పాలమూరును అభివృద్ధి చేసుకుందామని, విభేదాలు మరిచిపోయి ప్రజల అవసరాలు తీర్చాలని ప్రజాప్రతినిధులు, అధికారులను కోరారు. కాగా, రేషన్ కార్డులు కావాలని ప్రజలు అడుగుతున్నారని పలువురు సర్పంచులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.
స్పందించిన ఆయన గ్రామంలో తీర్మానం చేయాలని, ప్రభుత్వానికి ఆ తీర్మానం కాపీని అందించాలని చెప్పారు. అంతకుముందు ఆయన జిల్లా కేంద్రంలోని అయ్యప్ప కొండ మీద ఉన్న మణికంఠుడి ఆలయం, రవీంద్రనగర్‌లోని పోచమ్మ ఆలయం, కుమ్మరివాడిలోని హనుమాన్ ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ప్రత్యేక పూజలు చేశారు.
సాయంత్రం మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే న్యూ టౌన్ ఏరియాలోని మున్సిపల్ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. షాపు యజమానులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లాక్ చేసిన షాపులను వెంటనే తెరిపించాలని ఆదేశించారు. ఎంపీపీ సుభాశ్రీ, జడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, ఎంపీడీవో గోవింద్‌రెడ్డి, ఎస్ఏ వినోద్‌కుమార్, సిరాజుద్దీన్ ఖాద్రి పాల్గొన్నారు.