- ఆయా నగరాల్లో కూలీలతో ఆత్మీయ సమ్మేళనాలు
- పోలింగ్ ముందురోజు వచ్చి ఓటేయాలని విజ్ఞప్తులు
- ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు, ఫ్యామిలీ ప్యాకేజీలు ఇస్తమని హామీలు
- ప్రతి వెయ్యి మందికి ఒక ఇన్‌చార్జ్‌ను నియమించి ఫాలోఅప్
- పాలమూరు వలస కార్మికుల సంఖ్య 2.30 లక్షలపైనే
మహబూబ్ నగర్, వెలుగు: మహారాష్ట్రలోని ముంబై, పుణె, భీవండి తదితర నగరాల్లో ఉన్న పాలమూరు వలస కూలీల ఓట్ల కోసం ఉమ్మడి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. వారిని పోలింగ్ ముందు రోజు సొంతూర్లకు రప్పించి, ఓట్లు వేయించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ ఊరి నుంచి ఎంత మంది పక్క రాష్ట్రాలకు వలస పోయారో ఇప్పటికే లిస్ట్ తెప్పించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులు.. కార్మికులు ఉన్న ప్రాంతాలకే వెళ్లి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
ఎలాగైనా రెండు రోజులు తీరిక చేసుకొని సొంతూళ్లకు వచ్చి ఓటువేసి వెళ్లాలని రిక్వెస్ట్చేస్తున్నారు. ఓటుకు 2 వేల నుంచి 3 వేలతో పాటు దారి ఖర్చులు మొత్తం తామే పెట్టుకుంటామని హామీ ఇస్తున్నారు. 5 నుంచి 10 ఓట్లు ఉన్న ఫ్యామిలీకి స్పెషల్ ప్యాకేజీలు ఇస్తున్నారు. వెహికల్ కూడా అరేంజ్ చేస్తామని చెప్తున్నారు. ప్రతి వెయ్యి మందికి వారిలోనే ఒక ఇన్చార్జ్ని నియమించి అందరినీ తీసుకువచ్చేలా ఒప్పిస్తున్నారు. ఇందుకోసం పెద్దమొత్తంలో అమౌంట్ ఆఫర్ చేస్తున్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు ఇప్పటికే ఓ దఫా వలస కూలీలతో ములాఖత్అయ్యారు. త్వరలో మరోసారి సమావేశమయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పాలమూరు జిల్లా నుంచి వలసలు ఆగాయని చెబుతున్న నేతలే ఓట్ల కోసం పక్క రాష్ట్రాలకు పరుగులు తీయడం చర్చనీయాంశమవుతున్నది. సీఎం కేసీఆర్ సహా కొన్నేండ్లుగా ఇదే చెబుతున్నారని, మరి ముంబై, పుణె, థానే, షోలాపూర్, భీవండి ప్రాంతాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో వలస కూలీలతో ఫంక్షన్‌హాళ్లు ఎందుకు నిండుతున్నాయని జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు.
రూ.30 వేల ప్యాకేజీ
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్కో నియోజకవర్గంలో 7 వేల నుంచి 20 వేల మంది వలస ఓటర్లు ఉన్నారు. వారందరినీ కోఆర్డినేట్చేసుకునేందుకు ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల్లో ఇన్‌చార్జ్‌లను నియమించారు. ఇన్‌చార్జ్‌లు కూడా వలస కూలీలే. అధికార పార్టీ లీడర్లతో సన్నిహితంగా ఉండే వారిని గుర్తించారు. ఒక్కొక్కరికి వెయ్యి మంది కూలీల బాధ్యతను అప్పగించారు. పోలింగ్‌కు ఒక్కరోజు ముందు రోజు అందరినీ గ్రామాలకు తీసుకొచ్చేలా ప్లాన్చేశారు. ఓట్లు వేయించాక మరుసటి రోజు తిరిగి వారిని తీసుకెళ్లాల్సిన బాధ్యతను కూడా ఇన్‌చార్జ్‌లకే అప్పగించారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇన్‌చార్జ్‌లకు పెద్ద మొత్తంలో క్యాష్ముట్టజెప్పినట్లు తెలిసింది. ఒక్కో ఓటరుకు రూ.2 నుంచి రూ.3 వేల దాకా ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. నిజానికి వలస కూలీల్లో చాలామటుకు పెద్ద కుటుంబాలే. చిన్న పిల్లలు మినహా ప్రతి ఇంట్లో 5 నుంచి 10 మంది ఓటర్లు ఉన్నారు. ఇలాంటి ఫ్యామిలీలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల దాకా స్పెషల్ ప్యాకేజీ ఇస్తున్నట్లు సమాచారం. ఇక్కడికి వచ్చాక ఇబ్బంది అవుతుందని కూలీలు ఉండే ప్రాంతాల్లోనే డీల్కుదుర్చుకున్నట్లు తెలిసింది.
రేషన్ డీలర్ల నుంచి డేటా సేకరించి..
ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల ప్రజలు పొట్టకూటి కోసం ఎన్నో ఏండ్లుగా పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా ఈ వలసలు ఆగలేదు. స్థానికంగా ఉపాధి లేక మహారాష్ట్రలోని ముంబై, పుణె, షోలాపూర్, భీవండి తదితర ప్రాంతాల్లో కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. హన్వాడ, కోయిల్‌కొండ, గండీడ్, మహమ్మదాబాద్, వనపర్తి, దేవరకద్ర, మక్తల్, తాండూరు, పరిగి, మహబూబ్‌నగర్, బొంరాస్‌పేట, కోస్గి, నారాయణపేట, దౌల్తాబాద్, మద్దూరు, కొడంగల్, బాలానగర్ మండలాల్లోని గిరిజన తండాల నుంచి వలసలు ఎక్కువగా ఉన్నాయి. వీరంతా ఏడాదిలో రెండు దఫాలు మాత్రమే ఊళ్లకు వస్తారు. ఒక్క ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 2.30 లక్షల మంది వలస వెళ్లినట్లు కరోనా టైమ్‌లో హెల్త్ డిపార్ట్మెంట్ సేకరించిన లెక్కల్లో తేలింది. గ్రామాల వారీగా ఎంత మంది వలస కూలీలు ఉన్నారనే వివరాలను మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులు ఇప్పటికే రేషన్ డీలర్ల ద్వారా సేకరించారు. ఫోన్లు చేసి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటున్నారో నోట్చేసుకున్నారు. నారాయణపేట, మక్తల్, మహబూబ్‌నగర్, పరిగి, కొడంగల్, దేవరకద్ర నియోజకవర్గాల్లో వలస కూలీల ఓట్లు గెలుపోటములను డిసైడ్ చేస్తాయి. వారిని ప్రసన్నం చేసుకుంటే గంపగుత్తగా ఓట్లు పొందొచ్చని బీఆర్ఎస్ లీడర్లు ఆశిస్తున్నారు.
స్కీములు బంద్ చేస్తామని బెదిరింపులు
ముంబై, థానే, షోలాపూర్, పుణెలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలు, ప్రత్యేక సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు వలస కూలీలతో మాట్లాడుతూ ఒకింత బెదిరించినట్లు తెలిసింది. ఓట్లు వేయడానికి గ్రామాలకు కచ్చితంగా రావాలని, రాకుంటే ప్రభుత్వ స్కీములు బంద్‌చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. రేషన్కట్అవుతుందని, కార్డులు పోతాయని వార్నింగ్‌లు ఇచ్చినట్లు తెలిసింది. ‘‘మిమ్మల్ని తీసుకెళ్లడానికి మనుషులను పెట్టాం. వారే అన్ని చూసుకుంటారు. చెప్పిన టైంకు వచ్చి డీసీఎంలు, తుఫాన్లో ఎక్కితే చాలు’’ అని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
ALSO READ : కాంగ్రెస్‌కు అసెట్.. వివేక్ వెంకటస్వామి