పాలమూరుకు రాజకీయ గండం.. ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ యత్నం

పాలమూరుకు రాజకీయ గండం.. ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ యత్నం
  • తెలంగాణ సర్కారు చర్చలు జరిపినా స్పందించని కేంద్రం
  • కంప్లయన్స్ రిపోర్టులు ఇచ్చినా డీపీఆర్​లు వెనక్కి పంపిన సీడబ్ల్యూసీ
  • నీటి కేటాయింపులపై లెక్కలతో పాటు గత జూన్​లోనే వివరించిన అధికారులు
  • అయినా ప్రాజెక్టును అప్రైజల్​ లిస్ట్​ నుంచి తొలగించడంపై అనుమానాలు
  • ఏపీ నేతలు కేంద్రంలో చక్రం తిప్పి ఉంటారన్న సందేహాలు
  • ఆది నుంచి పాలమూరు ప్రాజెక్టుపై కేంద్రం మీనమేషాలు

హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు చిక్కుముడులు పడ్డాయి. తెలంగాణ అధికారులు ప్రాజెక్టుకు సంబంధించిన కంప్లయన్స్​ రిపోర్టును గత జూన్​లోనే పంపినప్పటికీ కేవలం పొలిటికల్​ కారణాలతోనే డీపీఆర్​లను తిప్పి పంపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టుకు చేసిన కేటాయింపులను కేవలం ఓ సాకుగానే చూపిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ సర్వ శక్తులనూ ఒడ్డుతున్నదని, అందుకు రాజకీయ పలుకుబడిని వాడుకుంటున్నదన్న చర్చ నడుస్తున్నది. ఈ ప్రాజెక్టుపై మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రంతో చర్చలు జరిపినా దానిపై స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. 

సడన్​గా ఇప్పుడే ఎందుకు?

ప్రాజెక్టును ప్రారంభించి దాదాపు తొమ్మిదేండ్లవుతున్నది.  పర్యావరణ అనుమతులను పక్కనపెడితే.. నీటి కేటాయింపులకు సంబంధించి అర్థంలేని వాదనలను ఏపీ తెరపైకి తీసుకొస్తున్నది. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదనలు వచ్చినప్పుడే గోదావరి జలాలను డైవర్ట్​ చేస్తే.. ఏపీ ఎంత వాడుకుంటే అంత మొత్తం నీళ్లను ఎస్ఎల్​బీసీకి వాడుకునేలా కేటాయింపులపై ప్రతిపాదనలు ఇచ్చారు. అయితే, ఆ నీటినే పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు వాడుకునేలా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే అసలు ప్రాజెక్టుకు కేటాయింపులే లేవని ఏపీ వాదిస్తున్నది. ఇన్నేండ్ల నుంచి సైలెన్స్​గా ఉన్న సీడబ్ల్యూసీ.. ఇప్పటికిప్పుడు ప్రాజెక్టును లిస్టు నుంచి తప్పించడం, డీపీఆర్​ను తిప్పి పంపడం వెనుక ఆంతర్యమేంటన్న సందేహాలు తలెత్తుతున్నాయి. 

2023లో డీపీఆర్​ను తిప్పి పంపుతామని సీడబ్ల్యూసీ హెచ్చరించడంతో.. ఈ ఏడాది మన అధికారులు కంప్లయన్స్​ రిపోర్టు ఇచ్చారు. గత ఎన్నికల్లో ఏపీలో ప్రభుత్వం మారి, ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన రాజకీయ నాయకులు కేంద్రంలో చక్రం తిప్పి ఉంటారన్న సందేహాలు ఇరిగేషన్​ సర్కిల్స్​లో వ్యక్తమవుతున్నాయి. కంప్లయన్స్​ రిపోర్టులు పంపినా సీడబ్ల్యూసీ ప్రాజెక్టును లిస్టు నుంచి తొలగించడం వెనుక కారణం అదే అయి ఉంటుందని చెబుతున్నారు. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలలకే సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రి ఉత్తమ్​ కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో భేటీ అయి.. ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఆర్థిక సాయం గురించి చర్చించినా ఇప్పటి వరకు కేంద్రం నుంచి స్పందన రాలేదు. పదే పదే ఒత్తిడి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం చలించడం లేదు. పైకి ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందిస్తామని కేంద్రం చెబుతున్నా.. అందుకు తగ్గట్టుగా ఒక్క నిర్ణయమూ వెలువడలేదు. పైగా ఇప్పుడు కక్షగట్టినట్టు సీడబ్ల్యూసీ ఏకంగా డీపీఆర్​లనే వెనక్కి పంపించేసింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలోనే ప్రాజెక్టుకు రాజకీయంగా అడ్డంకులు ఏర్పడుతున్నాయన్న వాదన వినిపిస్తున్నది.

జూన్​లోనే కంప్లయన్స్​ రిపోర్ట్​

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు గోదావరి డైవర్షన్​ ద్వారా వచ్చే 45 టీఎంసీలతోపాటు మైనర్​ ఇరిగేషన్​ ద్వారా ఆదా అవుతున్న మరో 45 టీఎంసీలను కలిపి కేటాయింపులుగా ఇరిగేషన్​ అధికారులు చూపించారు. దీనిపై ఏపీ అడ్డంగా వాదిస్తున్నది. అసలు ఆ ప్రాజెక్టుకు కేటాయింపులే లేవని బుకాయిస్తున్నది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ) ప్రాజెక్టును అప్రైజల్​ లిస్ట్​ నుంచి తొలగించి.. డీపీఆర్​ను తిప్పి పంపించింది. నీటి కేటాయింపు లెక్కల్లో స్పష్టత లేదని, వాటిపై వివరణ ఇస్తూ కంప్లయన్స్​ రిపోర్ట్​ను సబ్మిట్​ చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని కారణం చూపించింది. కానీ, అధికారులు మాత్రం కంప్లయన్స్​ రిపోర్టును గత జూన్​లోనే పంపించామని స్పష్టం చేస్తున్నారు.

కంప్లయన్స్​ రిపోర్ట్​లో అన్ని వివరాలను పొందుపరిచామని, పోలవరం డైవర్షన్​ ద్వారా 45 టీఎంసీలు వాటాగా ఎలా వస్తాయో కూడా వివరించామని అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత గోదావరి నుంచి డైవర్ట్​ చేసే 80 టీఎంసీల నీటిలో 45 టీఎంసీలను సాగర్​లో స్టోర్​ చేసి, అక్కడి నుంచి ఏపీ వాడుకునేలా స్కీమ్​పెట్టారని, అందుకు తగ్గట్టుగా కృష్ణా బేసిన్​లో మిగులు జలాల ఆధారంగా అంతే వాటా నీళ్లు తెలంగాణకు దక్కుతాయని తెలంగాణ అధికారులు తేల్చి చెబుతున్నారు. 

ఇటు మైనర్​ ఇరిగేషన్​లో 2012 నుంచి 2022 వరకు వాడుకోకుండా మిగిలిపోయిన జలాల వాటా కింద 45 టీఎంసీలనూ లెక్కలతోసహా చూపించినట్టు స్పష్టం చేస్తున్నారు.