- ఏడి పనులు ఆడ ఉండడమే కారణం
- పాలమూరు షో హిట్టా? ఫట్టా?
- బీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం
నాగర్ కర్నూల్, వెలుగు: 'తెలంగాణ సిద్ధించిన నాడు నా మనసు ఎంత పులకరించిపోయిందో ఈ రోజు పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా కృష్ణమ్మ జలాలు పైకి ఉబికి వస్తుంటే నా మనుసు అంతే పులకరించిపోయింది..నది వరదై పారుతున్నట్లుంది’ అంటూ ఈ నెల 16న సీఎం కేసీఆర్ మురిసిపోయారు. కృష్ణమ్మకు పూజలు నిర్వహించి, ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. సీఎం పాలమూరు స్కీములోని ఒక మోటర్ స్విచ్ఆన్చేసి, ఇలా కొల్లాపూర్ పొలిమేరలు దాటారో లేదో అలా పంప్ బంద్ అయ్యింది. ప్రాజెక్టు పనులు 40 శాతం పెండింగ్ ఉండగానే ఎలా ప్రారంభిస్తారని, ఇది కేవలం ఎన్నికల జిమ్మిక్కేనని ప్రతిపక్షాలు ఆరోపించినట్లే పాలమూరు షో కాస్తా ఒక్కరోజు మురిపెమే అయ్యింది.
పనులు పెండింగ్ ఉండడం వల్లే పంపు బంద్
-పాలమూరు– రంగారెడ్డి(పీఆర్ఎల్ఐ) కింద నిర్మించాల్సిన నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లలో ఏదుల తప్ప ఏదీ పూర్తికాలేదు. మొదటి ప్యాకేజీ కింద నిర్మిస్తున్న నార్లాపూర్ రిజర్వాయర్పనులు కూడా 30శాతం పెండింగ్ ఉన్నాయి. శ్రీశైలం బ్యాక్ వాటర్నుంచి నీటిని ఎత్తిపోయాల్సిన నార్లాపూర్ పంప్‌హౌస్‌లో తొమ్మిది మోటార్లలో సిద్ధమైంది ఒక్కటి మాత్రమే! ఈ మోటారుకే ఈ 16న సీఎం స్విచ్ఆన్ చేశారు. మోటార్ ఆన్ చేయగానే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి నీళ్లు పోశాయి. 6.42 టీంఎసీల కెపాసిటీ ఉన్న నార్లాపూర్ రిజర్వాయర్‌లో 2 టీఎంసీల దాకా నీళ్లు నింపుతామని ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్‌కుమార్, ప్రభుత్వ ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, మంత్రులు ఆరోజు ప్రకటించారు. అక్కడి నుంచి మెయిన్ కెనాల్ ద్వారా ఏదులకు నీటిని తరలించాల్సి ఉంది. కానీ, మధ్యలో మెయిన్ కెనాల్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏదుల నుంచి వట్టెం మెయిన్ కెనాల్, వట్టెం రిజర్వాయర్, పంప్‌హౌజ్, కర్వెన మెయిన్ కెనాల్ పనులూ అసంపూర్తిగా ఉన్నాయి.
కర్వెన నుంచి ఉదండాపూర్ రిజర్వాయర్ వరకు 18 కిలోమీటర్ల మేర అండర్ టన్నెల్ పనులు కాలేదు. ఈ రిజర్వాయర్ కింద 16వ ప్యాకేజీలో పంప్‌హౌస్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. 17, 18వ ప్యాకేజీల్లో ఇప్పటి వరకు కట్ట పనులు రిజర్వాయర్ కట్ట పనులు 15 శాతమే పూర్తయ్యాయి. 18వ ప్యాకేజీలో రెండున్నర కిలోమీటర్ల మేర చేయాల్సిన కట్ట పనులదీ,18వ ప్యాకేజీలో నిర్మించాల్సిన మెయిన్ కెనాల్స్ పనులదీ ఇదే పరిస్థితి. 400 కేవీ టవర్ లైన్స్, సబ్స్టేషన్లు, స్విచ్‌యార్డ్ పనులన్నీ స్కీంల వద్ద 40 శాతానికి మించి జరగలేదు. దీంతో ఒక మోటర్‌ను కేవలం నాలుగు గంటలపాటు నడిపి 6 వేల క్యూసెక్కులు రిజర్వాయర్‌లో పడగానే పంపులు బంద్ పెట్టారు.
బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని సర్వేల్లో తేలడంతో...
ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని సర్వేల్లో తేలడంతో అలర్ట్ అయిన సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డిని ఎన్నికల ముందు తెరపైకి తెచ్చారనే వాదనలున్నాయి. అందుకే హడావిడిగా ప్రారంభించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందుకు తగినట్లే సీఎం ఆదేశాలతో మంత్రులు, ఆఫీసర్లు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ఆగమేఘాలపై ఏర్పాట్లు చేశారు. అధికారిక కార్యక్రమం కావడంతో జనసమీకరణ బాధ్యతను ఆఫీసర్లు భుజాన వేసుకున్నారు.
అటు రూలింగ్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇటు ఆఫీసర్లు కలిసి కొల్లాపూర్‌కు భారీ సంఖ్యలో జనాల్ని తరలించారు. 16వ తేదీ రాత్రి ఒక పంప్ ట్రయల్ రన్ నిర్వహించిన ఇంజినీర్లు 17న సీఎం కేసీఆర్‌తో మొదటి పంప్ వెట్ రన్ స్టార్ట్ చేయించి, నాలుగు గంటల తర్వాత బంద్ పెట్టారు. కోట్లు పెట్టి ప్రచారం చేసుకొని సర్కారు ప్రారంభించిన పాలమూరు ప్రాజెక్టు ప్రతిపక్షాలు ఆరోపించినట్లు ఎన్నికల కోసం చేసిన షోగా మిగిలిపోయింది. ఈ విషయం సాధారణ జనాలకు చేరడంతో పాలమూరు ప్రారంభోత్సవం హిట్టయ్యిందో, ఫట్టయిందో తెలియట్లేదని బీఆర్ఎస్ నేతల్లో చర్చ జరుగుతోంది.