- ఏదుల తప్ప ఆరు రిజర్వాయర్లలో 50 శాతం దాటని పనులు
- 80 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయన్న సీఎం కేసీఆర్
- పలు రిజర్వాయర్ల కింద నేటికీ పూర్తికాని భూసేకరణ
- నిర్వాసితులకు దక్కని ఆర్అండ్ఆర్ ప్యాకేజీ
- ఎన్నికల నేపథ్యంలో మళ్లీ సర్కారు హడావిడి
- సెప్టెంబర్ నాటికి నీళ్లు ఇస్తామన్నది ఉత్తమాటే
మహబూబ్‌నగర్/నాగర్‌కర్నూల్, వెలుగు : పాలమూరు–-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం (పీఆర్ఎల్ఐ) పనులు 80 శాతానికి పైగా కంప్లీట్ అయ్యాయని, ఆగస్టు లేదా సెప్టెంబరు నాటికి సాగునీళ్లు ఇస్తామని సర్కారు చెబుతున్న మాటలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. ఏదుల రిజర్వాయర్ మినహా మిగిలిన ఐదు రిజర్వాయర్ల పనులు 50శాతం దాటలేదు. వట్టెం రిజర్వాయర్పనులు కేవలం 6 శాతమే జరగగా, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు ఇంకా మొదలుపెట్టలేదు. ఇక మెయిన్ కెనాల్స్, పంప్‌హౌస్‌లు, సబ్ స్టేషన్లు, ఎలక్ట్రికల్ వర్క్స్, రిజర్వాయర్ల కట్ట పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. కొన్ని రిజర్వాయర్ల కింద భూ సేకరణ నేటికీ పూర్తి కాలేదు. దాదాపు 150 మంది బాధితులు న్యాయమైన పరిహారం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఐదు రిజర్వాయర్ల కింద ఆర్అండ్ఆర్ సమస్య కొలిక్కి రాలేదు. సర్కారు కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధలో పదోవంతు కూడా పీఆర్ఎల్ఐ స్కీంపై పెట్టకపోవడం, సకాలంలో ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతో ఎనిమిదేండ్లుగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఫండ్స్ రిలీజ్ చేసి, కాంట్రాక్టర్లను పరుగుపెట్టించినా మరో ఏడాదిన్నరయితేగానీ సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని ఇంజినీర్లే చెప్తున్నారు. మరోవైపు ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ రూలింగ్పార్టీ పాలమూరు– రంగారెడ్డిని తెరపైకి తెచ్చి ఓట్ల రాజకీయం చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
నాలుగు రిజర్వాయర్ల వద్ద పనులు పెండింగ్
పాలమూరు– రంగారెడ్డి స్కీంలో భాగంగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్, లక్ష్మీదేవిపల్లి వద్ద మొత్తం ఆరు రిజర్వాయర్లు నిర్మించాల్సిఉండగా, లక్ష్మీదేవిపల్లిని పక్కన పెట్టేశారు. మొదటి ప్యాకేజీ కింద నిర్మిస్తున్న నార్లాపూర్ రిజర్వాయర్ కెపాసిటీని 8.50 టీఎంసీల నుంచి 6.5 టీఎంసీలకు తగ్గించారు. ఇక్కడి నుంచి ఏదులకు ఒక టీఎంసీ నీటిని తరలించేందుకు 24 కిలోమీటర్ల మెయిన్ కెనాల్ నిర్మించాల్సిఉండగా,16 కిలోమీటర్ల అండర్ టన్నెల్ పనులు పూర్తయ్యాయి. ఎనిమిది కిలోమీటర్ల ఓపెన్ కెనాల్వర్క్స్ ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసేందుకు చేపట్టిన పంప్‌హౌజ్, సర్జ్‌పూల్ కు సంబంధించి సివిల్ వర్క్స్ కొనసాగుతున్నా .. ఎలక్ట్రికల్, మెకానికల్ పనులు జరగడంలేదు. 400 కేవీ లైన్, సబ్ స్టేషన్ పనులు పూర్తి కాలేదు. 16.74 టీఎంసీల కెపాసిటీతో నిర్మిస్తున్న వట్టెం రిజర్వాయర్ కట్ట పనులు నాలుగు చోట్ల పెండింగ్‌లో ఉండగా, ఇటీవల మొదలయ్యాయి. పంప్‌హౌజ్, సర్జ్పూల్కు సంబంధించి సివిల్ పనులు జరుగుతున్నా ఎలక్ట్రిఫికేషన్, మెకానికల్ వర్క్స్ లేటవుతున్నాయి. 400 కేవీ సబ్ స్టేషన్ పనులు కొనసాగుతున్నాయి. ప్యాకేజీ 12లో భాగంగా చేపట్టిన వట్టెం నుంచి కర్వెన రిజర్వాయర్ వరకు మెయిన్ కెనాల్ పనులు పెండింగ్‌లో పడ్డాయి. గుమ్మకొండ వరకు కెనాల్ పనులు పూర్తి కాగా, అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల మేర కెనాల్ నిర్మించాల్సిఉంది. ఈ రిజర్వాయర్ కింద మూడు ప్యాకేజీల్లో కట్ట పనులు చేపట్టగా, 13వ ప్యాకేజీలో మాత్రమే పనులు కంప్లీటయ్యాయి. 14, 15వ ప్యాకేజీల్లో కట్ట పనులు, రివిట్మెంట్ పూర్తి చేయాల్సి ఉంది. ఇక్కడి నుంచి ఉదండాపూర్ రిజర్వాయర్ వరకు 18 కిలోమీటర్ల అండర్ టన్నెల్ నిర్మించాల్సి ఉంది. ఇందులో తొమ్మిది కిలోమీటర్ల వరకు నిర్మాణం పూర్తికాగా, మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. ఈ రిజర్వాయర్ కింద పంప్‌హౌస్ పనులు పెండింగ్‌లో ఉండగా, 17, 18వ ప్యాకేజీల్లో భాగంగాచేపట్టిన కట్ట పనులు ఇప్పటి వరకు పది శాతమే జరిగాయి.
కొలిక్కిరాని భూ సేకరణ, ఆర్అండ్ఆర్ సమస్య
నార్లాపూర్, ఉదండాపూర్ రిజర్వాయర్ల కింద దాదాపు 650 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ భూములకు సంబంధించి దాదాపు 120 రైతులు మల్లన్నసాగర్ తరహాలో పరిహారం ఇవ్వాలని, 2013 చట్టం ప్రకారం కుటుంబానికి ప్రత్యేక ప్యాకేజీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. నార్లాపూర్ కింద అంజనగిరి, వడ్డెగుడిసెలు, సున్నపుతండాల్లో 110 కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించారు. వీరికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయలేదు. ఉదండాపూర్ కింద వల్లూరు, ఉదండాపూర్, రేగడివట్టితండా, మాటుబండతాండ, గొల్లోనిదొద్దడి తండా, తుమ్మలబండతండా, సాధుగుడిసెలతండాల్లో మూడు వేల మందికి పైగానే నిర్వాసితులను గుర్తించారు. పునరావాసం కోసం భూసేకరణ చేసినా, ప్లాట్లు చేసి ఇండ్లను కట్టివ్వలేదు.
ఏదుల రిజర్వాయర్ కింద కొంకలోనిపల్లి, బండరావిపాకుల ముంపునకు గురవుతుండగా, 1,558 కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించారు. ఆర్అండ్ఆర్ కోసం భూమి సేకరించి ప్లాట్లు చేసి బాధితులకు అప్పటించారు. కానీ, ఇండ్లు కట్టివ్వలేదు.