- కంటిమీద కునుకు ఉండట్లేదని ఆవేదన
- నాలుగు గ్రామాలను వెంటాడుతున్న ముంపు భయం
- మొండికేస్తే బలవంతంగానైనా తరలించాలని ఆదేశాలు
- ఈనెల 31న డ్రైరన్‌కు ఏర్పాట్లు స్పీడప్
నాగర్ కర్నూల్, వెలుగు : పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ నుంచి ఈనెల చివరి వరకు నీళ్లు ఇచ్చి తీరాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ముంపునకు గురయ్యే నాలుగు గ్రామాల ప్రజలకు కంటిపై కునుకు లేకుండా పోతోంది. మొదటి ప్యాకేజీలోని నార్లాపూర్ రిజర్వాయర్ నింపితే సున్నపుతండా, వడ్డెగుడిసెలు, అంజనగిరి, దూల్యానాయక్తండా ముంపునకు గురవుతాయి. 200 ఇండ్లు రిజర్వాయర్‌లో మునుగుతాయి. ముంపునకు గురయ్యే గ్రామాల్లో కొందరి ఇండ్లకు పరిహారం అందింది. పునరావాసం కోసం స్థల సేకరణ చేయలేదు. ఇంటి జాగ కేటాయించలేదు. అల్టర్నేట్ స్థలం చూపించకుండా రిజర్వాయర్‌లోకి నీళ్లు వదిలితే పిల్లాపాపలతో తట్టాబుట్ట సర్దుకుని ఎక్కడిపోయి బతకాలే అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్‌కు ముందే నీళ్లిచ్చామని చెప్పుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న హడావిడితో ముంపు బాధితులు ఆందోళన చెందుతున్నారు. రాత్రికి రాత్రే ముంపు కుటుంబాలను బలవంతంగా తరలిస్తారనే వార్తలు వారిని మరింత కలవరానికి గురి చేస్తున్నాయి. నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ అమలులో ఆలస్యమైతే పోలీస్ ఫోర్స్తోనైనా రిజర్వాయర్ మధ్య నుంచి ఖాళీ చేయించాలన్న ఆదేశాలు వచ్చాయని సమాచారం.
పరిహారం పేరుతో ఆగం చేసిన్రు..
నార్లాపూర్ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న గ్రామాల్లో అంజనగిరిలో 100 ఇండ్లు, దూల్యా నాయక్ తండాలో 80 ఇండ్లు, వడ్డె గుడిసెల కాలనీలో 25 ఇండ్లు, సున్నపుతండాలో 50 ఇండ్లు ఉన్నాయి. నార్లాపూర్ వద్ద పాలమూరు కట్ట నిర్మాణం కోసం తవ్విన మట్టిని పోయడానికి 2018లో ఎకరాకు రూ.5.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా 33 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. బాధిత రైతులు మాత్రం తమకు రూ.1.70లక్షల చొప్పున చెల్లించారని వాపోతున్నారు. ఈ స్థలంలో ముంపునకు గురవుతున్న అంజనగిరి, వడ్డె గుడిసెలు, బోడబండ తండా, సున్నపుతండా వాసులకు పునరావాసం కింద ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మించి ఇండ్లు కట్టించడానికి చేసిన ప్రయత్నాలను బాధిత నిర్వాసితులు అంగీకరించలేదు.
గతంలో ఎకరాకు రూ.1.70లక్షల పరిహారం ఇచ్చి తమను ఆగం చేశారని, ఏ సౌలతుల్లేని అడవి మధ్య ఉండలేమని, కొల్లాపూర్ ఈదమ్మ గుడి దగ్గరలో ఇండ్లు కట్టించి ఇవ్వాలన్న నిర్వాసితుల డిమాండ్‌ను పక్కకు పడేశారు. ఇప్పుడు ఎక్కడ స్థలం చూపించకుండా అర్ధంతరంగా వెళ్లిపోమంటే ఎక్కడిపోయి బతకాలని వాపోతున్నారు. అంజనగిరికి చెందిన కొన్ని కుటుంబాలు ఎల్లూరు రిజర్వాయర్ దగ్గరలోని పటేల్ కంపెనీకి చెందిన స్థలంలో ఇండ్లు కట్టుకున్నారు.
వేగంగా పనులు..
పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్ట్‌లోని మొదటి మూడు ప్యాకేజీల కింద అంజనగిరి రిజర్వాయర్, సర్జ్‌పూల్, పంప్‌హౌజ్, ఓపెన్ కెనాల్ పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం విధించిన ఆగస్టు చివరి గడువులోగా కనీసం ఒకటి లేదా రెండు పంపులను స్టార్ట్ చేసేందుకు కాంట్రాక్ట్ ఏజెన్సీలు వేగంగా పనులు చేస్తున్నాయి. 400 కేవీ సబ్ స్టేషన్, రిజర్వాయర్, ఓపెన్ మెయిన్ కెనాల్, హెడ్ రెగ్యులేటర్ పనులు పెండింగ్‌లో ఉన్నా నీళ్లు బయటకు దుంకించాలనే పట్టుదలతో ఉన్నారు. ప్రాజెక్టులోని ఫస్ట్ లిఫ్ట్ నార్లాపూర్‌లో కనీసం గంట సేపైనా ఒక పంప్ నడిపించేందుకు ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు కుస్తీ పడ్తున్నారు. మే 6న నార్లాపూర్‌కు వచ్చిన సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ వర్క్ కంప్లీట్ చేయాలని ఏజెన్సీలకు టార్గెట్ ఫిక్స్ చేశారు.
31న డ్రైరన్..
ఈనెల 21న నార్లాపూర్ విజిట్‌కు వచ్చిన స్మితా సబర్వాల్ పాలమూరు స్కీంలో ఫస్ట్ పంపును ఈ నెల 31న డ్రై రన్ నిర్వహించి, సెప్టెంబర్ 15వరకు రెండో పంపు డ్రై రన్ నిర్వహించాలని ఆదేశించారు. డ్రై రన్ పూర్తయ్యే మొదటి పంపు ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో తాము రిజర్వాయర్‌లో మునిగి చావడానికైనా సిద్ధంగా ఉన్నామని నిర్వాసితులు తెగేసి చెప్తున్నారు. వడ్డె గుడిసెల్లో 50 ఇండ్లు ఉంటే 7 ఇండ్లకు మాత్రమే రూ.12.50 లక్షల పరిహారం చెల్లించారు. ఎన్యుమరేషన్ పూర్తిచేసి మిగిలిన ఇండ్లకు ఇస్తామని ఇంతవరకు ఇటువైపు రాలేదని వాపోతున్నారు. నిర్వాసితుల గోడుపై రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లు నోరు విప్పడం లేదు.
ఉన్న భూమి పోయింది..
ఉన్న ఎకరా భూమి పోయింది. ఓట్లప్పుడు ఎన్నో మాటలు చెప్పిన్రు. .ఇప్పుడు అడిగితే కసురుకుంటున్నరు. మా పరిస్థితిని పట్టించుకునేవారే లేరు.. మమ్మల్ని చంపితే సర్కార్‌కు మా బాధ ఉండదు.
- మహేశ్వరి, వడ్డె గుడిసెలు
బతకడానికి పట్నం పోతున్నరు
మా భూముల్ల వడ్లు, పల్లీలు పండించి బతికినం. ఇప్పుడు ఉప్పు, పప్పు పుడ్తలేదు. 8 ఏండ్ల నుంచి మాది ఇదే కష్టం. బతకడానికి పిల్లలు పట్నం పోయిండ్రు. నీళ్లు వస్తే అందరం మునిగి సస్తం.
- బుజ్జి, దూల్యానాయక్ తండా