మహబూబ్‌నగర్, వెలుగు : పాలమూరు వడ్లు వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. వడ్లు చేతికొచ్చి నెల రోజులు దాటినా.. ఇంకా ప్రభుత్వ కొనుగోలు సెంటర్లు పూర్తి స్థాయిలో ప్రారంభించి కాంటాలు పెట్టకపోవడంతో ఈ పరిస్థితి ఉంది. దీనికితోడు అకాల వర్షాలు పడుతుండడంతో చేతికొచ్చిన పంట నష్టపోతామనే భయంతో వ్యాపారులు చెప్పిన రేట్‌కే రైతులు వారికి వడ్లను అమ్మేస్తున్నారు.
ఉమ్మడి పాలమూరులో ఇదీ పరిస్థితి..
వనపర్తి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా, 4 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తాయని ఆఫీసర్లు అంచనా వేశారు. జిల్లాలో నెల కింద 255 వడ్ల సెంటర్లను ఓపెన్ చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు 123 సెంటర్లను మాత్రమే తెరిచింది. ఈ సెంటర్ల ద్వారా3 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనాలని టార్గెట్ పెట్టుకోగా, 90 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నది. నారాయణపేట జిల్లాలో 1,33,893 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా, 3,38,757 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. 103 వడ్ల కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 68 కేంద్రాలు తెరిచారు. 2,92,498 మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేయాలని టార్గెట్ పెట్టుకోగా ఇప్పటి వరకు 4,413 మెట్రిక్ టన్నుల వడ్లనే కొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో 1.20 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా, 3.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా ఉంది. ఈ మేరకు 190 వడ్ల సెంటర్లను ఓపెన్ చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు 184 సెంటర్లను తెరిచారు. ఈ సెంటర్ల ద్వారా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనాలని అంచనా ఉండగా, 1.50 లక్షల మెట్రిక్ టన్నులు కొనాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ, ఇప్పటి వరకు 17,650 మెట్రిక్ టన్నుల వడ్లనే కొన్నరు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 1,52,384 ఎకరాల్లో వరి సాగు చేయగా, 4.30 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందనే అంచనా ఉంది. ఈ మేరకు 214 సెంటర్లు తెరువాలని నిర్ణయించగా, 142 సెంటర్లు ఓపెన్ చేశారు. 3.30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 12 వేల మెట్రిక్ టన్నులను మాత్రమే కొన్నరు. జోగులాంబ గద్వాల జిల్లాలో 60 వేల ఎకరాల్లో పంట సాగవగా, 1.87 లక్షల మెట్రిక్ టన్నుల పంట వస్తుందని అంచనా వేశారు. ఈ మేరకు 71 సెంటర్లను ఓపెన్ చేయాల్సి ఉండగా 17 సెంటర్లను మాత్రమే తెరిచిన్రు. ఈ సెంటర్ల ద్వారా కేవలం రెండు క్వింటాళ్ల వడ్లనే కొన్నరు.
పంటను కొని స్టాక్ పెడుతున్రు..
వడ్ల సెంటర్లు తెరవడం ఆలస్యమైతే నారాయణపేట, మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాల రైతులు ట్రాక్టర్లు, లారీల్లో పంటను కర్నాటకలోని మార్కెట్‌కు తరలించి అమ్మేవారు. ఇప్పుడు అక్కడ ఎలక్షన్లు ఉండడంతో పంటను అక్కడి మార్కెట్లకు తీసుకెళ్లడం లేదు. కానీ, అక్కడి వ్యాపారులు ప్లాన్ ప్రకారం ఇక్కడి రైతుల పంటను కొంటున్నారు. ఇందుకు స్థానికంగా ఉన్న బియ్యం వ్యాపారులతో ఒప్పందం చేసుకొని, రైతుల కల్లాల వద్దకే లారీలు, డీసీఎంలను తీసుకొచ్చి కొనుగోలు చేయిస్తున్నారు. ఇక్కడి వ్యాపారుల రైస్ మిల్లులకు తరలించి, స్టాక్ చేసి పెట్టుకున్నారు. కర్నాటకలో ఎలక్షన్లు ముగిసిన వెంటనే ఈ స్టాక్‌ను షిఫ్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆఫీసర్ల కొర్రీలు..
ప్రస్తుతం అన్ని జిల్లాల్లో వడ్ల సెంటర్ల వద్దకు పంట వస్తోంది. నెల కిందట కోతలు కోసి పంటను ఆరబెట్టినా ఆఫీసర్లు పంట కొనేందుకు కొర్రీలు పెడుతున్నారు. మాయిశ్చర్ 9, 10 శాతం వస్తున్నా.. మళ్లీ పంటను ఆరబెట్టాలని రైతులకు చెబుతున్నారు. రాష్ట్ర సర్కారు చెడగొట్టు వానలకు తడిసిన వడ్లను కొంటామని చెప్పినా.. ఆఫీసర్లు మాత్రం పంటను కొనకుండా ఆలస్యం చేస్తున్నారని రైతులు ఫైర్ అవుతున్నారు. పంటను కొనాలని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఆఫీసర్లపై ఒత్తిడి తెస్తే.. ‘రైస్ మిల్లర్లు రిజెక్ట్ చేస్తే మాకు సంబంధం లేదు. డబ్బులు పడవు’ అంటూ భయపెడుతున్నారని అడ్డాకుల, మూసాపేట మండలాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వడ్లు ఎండినా కొంటలేరు..
కల్లాల్లో వడ్లను పెట్టుకొని కంటి మీద కునుకు లేకుండా కాపాడుకుంటున్నాం. లీడర్లు, ఆఫీసర్లు వడ్ల సెంటర్ల వద్దకే వస్తలేరు. ప్రతి గింజను కొంటమని చెప్పిన్రు. గింజలు ఎండినా కొంటలేరు.
- పోతురాజు రాములు, అమ్మపూర్, చిన్నచింతకుంట
కాంట ఏస్తలేరు..
వడ్లు ఆరబెట్టుకొని సెంటర్‌కు తెచ్చి పది రోజులకు ఎక్కువాయే. కాంటా చేస్తలేరు. వడ్లను బస్తాల్లో నింపేందుకు గన్నీ బ్యాగులను కూడా ఇస్తలేరు. సెంటర్ తెరిచినా వడ్లు కొంటలేరని లీడర్లకు తెలిసినా ఎవరూ పట్టించుకుంటలేరు. కల్లాల్లోనే వడ్లను ఉంచినం. ఎప్పుడు వర్షం వస్తదోనని భయంగా ఉంది.
- తిమ్మన్న, రైతు, కురుమూర్తి, చిన్నచింతకుంట మండలం