- 8 నెలలుగా ఖాళీగా ఉన్న పాలమూరు టీబీ హాస్పిటల్
- తాగునీళ్లు లేవు.. ఏడాదిగా పని చేయని బోరు
- వార్డుల్లో వెలగని ట్యూబ్‌లైట్లు.. తిరగని ఫ్యాన్లు
- కాలిపోయిన స్విచ్ బోర్డులు.. ఉండని కరెంట్
మహబూబ్‌నగర్, వెలుగు: వైద్య సేవలందించాల్సిన టీబీ హాస్పిటల్ నిర్మానుష్యంగా మారింది. ఖాళీ బెడ్లు, వార్డుల్లో వెలాడుతున్న వైర్లు, ఊడిపోయిన స్విచ్ బోర్డులు, బల్పు హోల్డర్లతో దర్శనమిస్తోంది. అక్కడక్కడా పెచ్చులూడి, చుట్టూ గడ్డి పెరిగి బూత్ బంగ్లాను తలపిస్తోంది. మూడునెలలుగా డాక్టర్ లేకపోవడంతో పేషెంట్లు రావడం మానేశారు. వచ్చినా.. ఇన్‌పేషెంట్లుగా ఉండడం లేదు. ఎనిమిది నెలలుగా ఒక్క పేషంట్ కూడా అడ్మిట్కాలేదంటే పరిస్థితి ఎలా అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కేవలం 26 మంది మాత్రమే ఓపీలో మందులు తీసుకున్నారు.
1972 నుంచి సేవలు
1970లో అప్పటి డిప్యూటీ సీఎం నర్సింగ్‌రావు పాలమూరు జిల్లా పరిధిలోని అప్పన్నపల్లి రిజర్వ్‌ఫారెస్ట్‌లో టీబీ హాస్పిటల్‌కు శంకుస్థాపన చేయగా... రెండేళ్ల తర్వాత 1972లో అప్పటి మంత్రి ఇబ్రహీం అలీ అన్సారీ హాస్పిటల్‌ను ఓపెన్ చేశారు. ప్రస్తుతం ఈ హాస్పిటల్‌లో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్ కులోసిస్కు పది బెడ్లు, పల్మనేటరి ట్యూబర్ కులోసిస్కు పది బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఒక మెడికల్ ఆఫీసర్, నలుగురు స్టాఫ్ నర్సులు, ఒక దోబి, ఒక వాచ్మెన్ పని చేయాల్సి ఉంది. కానీ, మూడు నెలలుగా ఇక్కడ మెడికల్ఆఫీసర్ లేడు. గతంలో ఇక్కడ పని చేసిన డాక్టర్ శ్రీధర్‌రెడ్డికి ప్రమోషన్ రావడంతో వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఈ హాస్పిటల్‌కు డాక్టర్‌ను అలాట్ చేయలేదు. నలుగురు నర్సులు ఉండగా, ఈ ఏడాది మొదట్లో పాలమూరులో ఉన్న బస్తీ దవాఖానాకు ఇద్దరిని డిప్యూటేషన్‌పై పంపారు. మిగిలిన ఇద్దరు మాత్రమే డ్యూటీ చేస్తున్నారు.
తాగు నీళ్లు లేవు.. స్వీచ్ బోర్డులు పనిస్తలే
హాస్పిటల్‌లో తాగేందుకు మంచి నీళ్లు కూడా లేవు. ఇప్పటి వరకు భగీరథ కనెక్షన్ ఇవ్వలేదు. బోరు ఉన్నా ఏడాది కిందట మోటారు చెడిపోయింది. దీన్ని రిపేర్ చేయించకపోవడంతో బాత్రూమ్లు, టాయిలెట్లలో నీళ్లు వస్తలేవు. పేషెంట్లకు హెల్పర్లుగా వచ్చే వారు వంటలు చేసుకోవడానికి ఒక రూమ్‌ను కట్టించినా నీటి సౌలత్ లేదు. ఎండీఆర్, పీటీబీ వార్డుల్లో 70 శాతం స్విచ్ బోర్డులు పని చేయడం లేదు. చాలా బోర్డులో కాలిపోయాయి. స్విచ్‌లు పని చేయడం లేదు. వారుల్లో రెండు, మూడు చోట్ల మాత్రమే ట్యూబ్ లైట్లు వెలుగుతున్నాయి. మిగతా చోట్ల షోపుటప్‌గా ఉన్నాయి. రెండు వార్డుల్లో డజన్ వరకు ఫ్యాన్లు ఉండగా సగమే పని చేస్తున్నాయి. బల్బు హోల్డర్లు ఎక్కడికక్కడ వేలాడుతున్నాయి. వైర్లు మొత్తం బయటకు వచ్చి ఉన్నాయి.
కరెంట్ పోతే అంతే సంగతి..
హాస్పిటల్అటవీ ప్రాంతంలో ఉండటంతో చిన్న గాలులు వీచినా చెట్లకు వైర్లు తగిలి కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. జనరేటర్ కూడా లేదు. మెయిన్‌రోడ్డు నుంచి హాస్పిటల్లోపలి వరకు ఐదు మీటర్లకు ఒక ఎల్‌ఆడీ లైట్‌ను ఏర్పాటు చేసినా అవి వెలగడం లేదు. కొన్ని చోట్ల పగిలిపోయాయి. కరెంటు పోతే హాస్పిటల్మొత్తం చీకట్లో ఉంటుండటంత సిబ్బందే రూ.4,500 సమకూర్చుకోని చార్జింగ్ బల్పులను ఏర్పాటు చేసుకున్నారు.
పాములు, నక్కలు, అడవి పందులు వస్తున్నయ్
చుట్టూ కొండలు, అటవీ ప్రాంతం కావడంతో హాస్పిటల్ లోకి పాములు వస్తున్నాయి. రాత్రయితే నక్కలు, అడవి పందులు వస్తున్నాయి. రోజూ ఉదయం హాస్పిటల్గేట్ను ఓపెన్ చేసి జాడు కొట్టే టైమ్‌లో స్వీపర్లు వాటిని అదిలించి బయటకు పంపుతున్నారు. రాత్రి వేళల్లో ఆకతాయిలు ఇక్కడ మందు తాగుతున్నారని సిబ్బంది చెబుతున్నారు. పోలీసులు మహబూబ్‌నగర్‌నుంచి మయూరీ నర్సరీ వరకు పెట్రోలింగ్ చేస్తున్నా హాస్పిటల్ వైపు మాత్రం రావడం లేదు. దీంతో ఇక్కడ ఉండలేమని పేషంట్లు వెళ్లిపోతున్నారు.
తాగేందుకు నీళ్లు కూడా లేవు
రోడ్డు నుంచి గుట్ట మీద ఉన్న హాస్పిటల్ వరకు నడుచుకుంటూ రావాలి. దూపైతే తాగేందుకు మంచినీళ్లు కూడా లేవు. గాలొస్తే కరెంటు పోతది. మళ్లీ ఎప్పుడు వస్తదో తెల్వదు. కరెంటు సమస్య ఉంటే ఫోన్ చేయాలని ఒక నంబర్ ఇచ్చారు. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా వస్తామంటారే తప్ప, రారు. రోజులో పది పాములన్నా వస్తయి. భయం భయంగా ఉంటున్నం.
–అనురాధ, స్టాఫ్ నర్స్, టీబీ హాస్పిటల్, పాలమూరు
డాక్టర్‌ను అలాట్ చేస్తం
ప్రస్తుతం డాక్టర్ లేరు. సెప్టెంబరు రెండో వారంలో కౌన్సెలింగ్ ఉంది. ఆ తర్వాత డాక్టర్‌ను అలాట్చేస్తం. తాగునీటి విషయం గురించి కలెaక్టర్‌తో మాట్లాడినం. ‘భగీరథ’ పైపులైన్ వేయిస్తామని చెప్పారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్వాళ్లకు కూడా ఇన్ఫాం చేశాం. చెట్లు పెద్దగా పెరగడం వల్ల కరెంటు సఫ్లైలో ఇబ్బంది అవుతోందని చెప్పినం.
–రఫీక్, టీబీ ప్రోగ్రాం ఆఫీసర్, మహబూబ్‌నగర్