అమ్మా పోయొస్త.. బిడ్డా పైలం
మళ్లీ వలస బాట పట్టిన పాలమూరు కార్మికులు
కరోనా ఎఫెక్ట్‌తో అష్టకష్టాలు పడ్డరు
సొంత ఊరిలో కరువైన ఉపాధి
బతుదెరువుకు మళ్లీ నగరాల వైపు పయణం
‘అమ్మా పోయొస్త.. పిల్లలు పైలం’ అంటూ పాలమూరు కార్మికులు మళ్లీ వలస బాట పడుతున్నరు. ముంబయి, పుణె, బెంగళూరు లాంటి నగరాల్లో కూలీ పని చేసే వీళ్లు కరోనా ఎఫెక్ట్‌తో అష్టకష్టాలు పడ్డ ముచ్చట ఎరుకే. చేసేందుకు పని లేక… తినేందుకు తిండి లేక.. కాలినడకనే వేల కి.మీ. నడిచి సొంతూళ్లకు చేరిన తీరు యాది మరిచేది కాదు. కానీ, ఇక్కడా ఉపాధి దొరకక పూట గడవడం కష్టంగా మారింది. ప్రస్తుతం అన్‌లాక్‌తో నగరాలు మునుపటి స్థితికి చేరడంతో బతుకుదెరువును వెతుక్కుంటూ మళ్లీ నగరాలకు పయణం అవుతున్నరు.
నారాయణపేట, వెలుగు: పాలమూరు వలసలకు పెట్టింది పేరు. పక్కనే కృష్ణమ్మ పారుతున్నా పాలకుల నిర్లక్ష్యంతో తాగు, సాగునీటి అవసరాలకు నిత్యం ఇబ్బందులు తప్పట్లేదు. పరిశ్రమలు కూడా అంతంత మాత్రమే. అన్‌గోయింగ్ సాగునీటి ప్రాజెక్టులు ఉన్నా.. ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి. దీంతో లక్షల మంది పాలమూరు జనం బతుకుదెరువు కోసం మహానగరాల బాట పట్టారు. కానీ, కరోనా ఎఫెక్ట్‌తో ఉపాధి కోల్పోవడంతో సొంతూళ్లకు చేరుకొని ఉపాధి పని, పొలాల్లో కూలి పని చేస్తూ గడిపారు. కానీ, ఇప్పుడు ఆ పనులు కూడా దొరకకపోవడంతో మళ్లీ వలస బాట పడుతున్నారు.
14 లక్షల మంది కార్మికులు
మహబూబ్‌నగర్, నారాయణ పేట జిల్లాలను ప్రతి ఏటా దాదాపు 14లక్షల మంది బిడ్డలు వలస వెళ్తునట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ముంబయి, పుణె, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్, ఒడిశా, దుబాయ్, మలేషియాలకు ఎక్కువగా వెళ్తున్నారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజదాని అమరావతికి కూడా పోతున్నారు. అక్కడ కంపెనీలు, పరిశ్రమల్లో ఆఫీస్‌బాయ్, లేబర్ మొదలు కొని సూపర్ వైజర్ల వరకు వివిధ స్థాయిల్లో పని చేస్తున్నారు.
నెరవేరని హామీలు
పాలమూరు, పేట జిల్లాలో వలస నివారణకు కృషి చేస్తున్నామని పాలకులు చెబుతున్నా ఆచరణలో అవి కనిపించడం లేదు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, పరిశ్రమలు స్థాపిస్తామని చెబుతున్నా.. అవి ఎన్నటికి అవుతాయో తెలియని పరిస్థితి ఉంది. మూడేళ్లలో పూర్తిచేస్తామన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆరేళ్లవుతున్నా 30 శాతం కూడా పూర్తికాలేదు. దీంతో వలసలు ఆగడం లేదు. ముఖ్యంగా గిరిజన తండాల పరిస్థితి దారుణంగా ఉంది. దామరగిద్ద, ధన్వాడ, కోయిలకొండ, మద్దూర్, నారాయణపేట మండలంలోని గిరిజన తండాలు అయితే జనం లేక బోసిపోతున్నాయి. ముంబయి, పుణె వంటి ప్రాంతాల్లో ఎప్పుడూ పని ఉంటుందని, రోజుకు రూ.500 కూలీ ఇస్తారని కార్మికులు
చెబుతున్నారు.
నిండిపోతున్న బస్టాండ్‌లు
నారాయణపేట, మహబూబ్‌నగర్ డిపోల నుంచి ముంబయికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులు వలస కూలీలతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి రోజు నారాయణపేట బస్టాండ్‌లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల సమయంలో ఎమోషనల్ దృశ్యాలు కనిపిస్తున్నాయి. వలస వెళ్తున్న వారిని చూసి.. బిడ్డలు, తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వారు కూడా ‘పిల్లలు పైలం.. నెలనెల పైసలు పంపిస్త మంచిగ సదివియ్యిండి’ అని టాటా చెప్పి వెళ్తుండడంతో గుండెలు బరువెక్కుతున్నాయి.
పరిశ్రమలు స్థాపించాలి
పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పించాలి. సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాలి. ఈ రెండు అంశాలపై ఫోకస్ పెట్టకనే ఇక్కడి ప్రజలు హైదరాబాద్, పుణె, ముంబయి ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.
– సత్యయాదవ్, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి
పిల్లల కోసమే..
కరోనా టైమ్‌లో సొంతూరుకు వచ్చినం. వానాకాలంలో పంట కూడా పండించాం. యాసంగిలో నీటి ప్రాబ్లంతో పంట పండదు. నాకు ఇద్దరు పిల్లలు… వారి బాగు కోసమే ముంబయి పోతున్నం.
– లక్ష్మి బాయి, బోయిన్పల్లి తండా, నారాయణపేట మండలం
For More News..